విద్యారంగంలో సంస్కరణలు పూర్తి.. ఫలితాలపై దృష్టిపెట్టాలి : మంత్రి లోకేష్
Publish Date:Jul 27, 2026
Advertisement
విద్యారంగంలో సంస్కరణలు పూర్తయ్యాయని, ఫలితాలపై దృష్టిపెట్టాలని అధికారులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులోని జడ్పీ ఉన్నత పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో వసతులు, విద్యా ప్రమాణాలపై మంత్రి ఆరా తీశారు. ముందుగా పాఠశాలలోని పదో తరగతి ‘ఏ’ సెక్షన్ విద్యార్థులతో మంత్రి సంభాషించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మీ సీనియర్స్ కంటే మీరు బాగా చదవాలి. గతేడాది పదో తరగతిలో 67శాతం మంది విద్యార్థులు మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర సరాసరి కంటే ఇది 11 శాతం తక్కువ. మీకు మార్కులు రాకపోతే సీఎం చంద్రబాబునాయుడు గారు నా మార్కులు తగ్గిస్తారు. కాబట్టి మీరంతా బాగా చదవాలని వారిని ఉత్సాహపరిచారు. మీరు చేయాల్సిందల్లా బాగా చదవడమే..! విద్యార్థులకు పదో తరగతి చాలా ముఖ్యం. పది, ఇంటర్మీడియట్ చదివే సమయంలో నా జీవితంలో మార్పు వచ్చిందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ఇప్పుడు మంచి మార్కులు వస్తేనే భవిష్యత్ బాగుంటుందని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ అందజేత, పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులను మంత్రి ఆరా తీశారు. బాగుందని విద్యార్థులు సమాధానం ఇచ్చారు. ప్రజాప్రభుత్వంలో మధ్యాహ్న భోజనానికి ఫైన్ రైస్ ను వినియోగిస్తున్నామని చెప్పారు. రాగి జావ ఎంతమందికి ఇష్టం, చిక్కీ ఎంతమందికి ఇష్టం అని మంత్రి సరదాగా ప్రశ్నించగా.... అధికశాతం మంది విద్యార్థులు చిక్కీ ఇష్టమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రభుత్వం కృషిచేస్తోందని, అన్ని వసతులు, సౌకర్యాలు కల్పిస్తోందని, మీరు చేయాల్సిందల్లా బాగా చదవడమేనని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. చదువుకున్నది జీవితంలో ఎంతవరకు ఉపయోగపడుతున్నదన్నది ముఖ్యం, లోకజ్ఞానం కూడా అవసరమేనని పేర్కొన్నారు. బాగా చదువుకోవాలని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అభ్యసన సామర్థ్యాల్లో వెనుకబడి ఉండటంపై మంత్రి అసంతృప్తి.. గతేడాది కంటే ఈ ఏడాది 19 మంది విద్యార్థులు పాఠశాలలో కొత్తగా ప్రవేశాలు పొందారు. ఇందుకు పాఠశాల సిబ్బందిని మంత్రి అభినందించారు. మౌలిక సౌకర్యాల్లో పాఠశాల 2.76 రేటింగ్ సాధించింది. అయితే పాఠశాలలోని విద్యార్థులు అభ్యసన సామర్థ్యాల్లో వెనుకబడి ఉండటంపై మంత్రి అసృతృప్తి వ్యక్తం చేశారు. అద్భుతమైన మౌలిక సౌకర్యాలు, మంచి ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ లెర్నింగ్ అవుట్ కమ్స్, సమ్మెటివ్, ఫార్మాటివ్ అసెస్ మెంట్స్ లో స్కూల్ వెనుకబడి ఉంది. లెర్నింగ్ అవుట్ కమ్స్ లో 0.9శాతం రేటింగ్ సాధించింది. పట్టణ ప్రాంతానికి దగ్గరగా ఉన్న పాఠశాల అభ్యసన సామర్థ్యాల్లో వెనుకబడి ఉందని, లెర్నింగ్ అవుట్ కమ్స్ పై ప్రత్యేక దృష్టిసారించాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి ఆదేశించారు. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి పెట్టాలని సూచించారు. అనుమతి లేకుండా ఉపాధ్యాయులు గైర్హాజరు కావడాన్ని నివారించాలన్నారు. ఒకేషనల్ ల్యాబ్స్ పైనా దృష్టిసారించాలని ఆదేశించారు. ఇంటర్ లో ఒకేషనల్ కోర్సులపై దృష్టిసారించడం ద్వారా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. విద్యారంగంలో సంస్కరణలు పూర్తయ్యాయి.. ఫలితాలపై దృష్టిపెట్టాలి.. పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల విషయంలోనూ మంత్రి ఆరా తీశారు. వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పాఠశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఫలితాల మెరుగుదలకు విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలని, విద్యావ్యవస్థ బాగుండాలంటే సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రెండూ ముఖ్యమేనని చెప్పారు. పదో తరగతి పరీక్షా ఫలితాల మెరుగుదలపై దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యారంగంలో సంస్కరణలు పూర్తయ్యాయని, ఫలితాలపై దృష్టిపెట్టాలన్నారు. 340 మంది ఉన్న పాఠశాలలో మార్పు కనపడాలని, ఆ మార్పు ఫలితాల్లో ప్రతిబింబించాలని ఆదేశించారు. అనంతరం తొమ్మిదో తరగతి విద్యార్థులతో మంత్రి మాట్లాడారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రశ్నించారు. విద్యార్థులకు ఆటోగ్రాఫ్ లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ.వెంకటేశ్వరరావు, ఆర్జేడీఎస్ నాగమణి, డీఈవో యూవీ సుబ్బారావు, ఎంఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. Nara Lokesh, Krishna District, Nara Lokesh Penamaluru Visit, Pandyapadu ZP School,Kankipadu Mandal, CM Chandrababu
http://www.teluguone.com/news/content/nara-lokesh-36-227258.html





