మంగళసూత్రం మొగుడికే మృత్యు పాశం.. భార్యల చేతుల్లో భర్తల హతం.!
Publish Date:Jul 22, 2026
Advertisement
పవిత్రమైన వివాహ బంధంలో ఇటీవల కాలంలో ఆందోళనకర ధోరణులు పెచ్చరిల్లుతున్నాయి. దంపతుల మధ్య విభేదాలు వస్తే సర్దుకుపోయే సంస్కృతి కనుమరుగైపోతున్న పరిస్థితి కనిపిస్తోంది కుటుంబ వ్యవస్థలో ఆందోళనకర, ప్రమాదకర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పవిత్రమైన వివాహబంధం మొగుడూ పెళ్లాల మధ్య అనురాగం, ఆప్యాయత, ప్రేమలతో ముడి పడి ఉంటే పరిస్థితి నుంచి పరస్పరం కక్షలూ కార్పణ్యాలతో బద్ధ శత్రువులుగా మారే పరిస్థితి ఉత్పన్నమౌతోంది. ఇటీవలి కాలంలో భార్యల చేతుల్లో హతమౌతున్న భర్తల సంఖ్య పెరిగిపోతోంది. భర్తలనే భార్యలు హతమార్చడం వంటి కలవరపరిచే ఉదంతాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ విషయం ఇటీవల ఏకం న్యాయం ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన నివేదిక తేటతెల్లం చేసింది. ఈ నివేదిక భర్తల ప్రాణాలు తీస్తున్న ఘటనలు సమాజంలో ఏ స్థాయిలో పెరుగుతున్నాయో కళ్లకు కట్టింది. ఏకం న్యాయం ఫౌండేషన్ ప్రచురించిన నివేదిక మేరకు.. ఈ ఏడాది జనవరి 1 నుంచి గత నెల 14 వరకూ అంటే ఆరున్నర నెలల వ్యవధిలోనే దేశంలో ఏకంగా 554 మంది భర్తలు భార్యల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మొత్తం మరణాలను పరిశీలిస్తే, దాదాపు 322 మంది పురుషులు భార్యల చేతిలోనే హత్యకు గురయ్యారు. మరో 182 మంది భార్యల వేధింపులు, మానసిక చిత్రహింసలు కుటుంబ వివాదాలు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇక మిగిలినవి అనుమానాస్పద మరణాలు. ఈ నివేదిక ప్రకారం.. దేశంలో ప్రతిరోజూ సగటున ఇద్దరు భర్తలు తమ భార్యల చేతిలోనే దారుణ హత్యలకు గురవుతున్నారు. అలాగే రోజూ కనీసం ఒకరు భార్యల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మొత్తం భార్యల చేతిలో హతమైనట్లు నమోదైన 322 హత్య కేసుల్లో 194 కేసులు.. అంటే 60.2 శాతం కేసుల్లో భార్యల వివాహేతర సంబంధాలే ఈ హత్యకు కారణమని తేలింది. వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నాడన్న కారణంతో.. భార్యలు తమ ప్రియుల సహకారంతో ఈ హత్యలకు పాల్పడినట్లు నివేదిక తేటతెల్లం చేసింది. కొన్ని కేసులలో ఆస్తి తగాదాలు, ఆర్థిక వివాదాలు, వ్యసనం, అనుమానం, వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. ఇక పోతే.. భార్యల చేతిలో భర్తలు హత్యకు గురైన సంఘటనతో పాటు భార్యల మానసిక వేధింపులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న భర్తల సంఖ్యా పెద్దగానే ఉంది. భార్యల ప్రవర్తన, అక్రమ సంబంధాలు, భార్యల చేతిలో హింసకు గురి కావడం, తప్పుడు కేసులు పెడతామన్న బెదరింపుల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై భర్తలు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలూ ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని నివేదిక నిర్ద్వంద్వంగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోనూ ఇలా భార్యల చేతిలో హతమైన భర్తల సంఖ్య భారీగానే ఉంది. ఎన్సీఆర్బీ ప్రకారం రాష్ట్రంలో ఏటా సగటున 898 హత్యలు నమోదు కాగా, వాటిలో 195 వివాహేతర సంబంధాలు, కుటుంబ వివాదాల కారణంగానే జరుగుతున్నాయి. ఈ విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. మారుతున్న జీవనశైలి, విలువలు క్షీణత ఇటువంటి సంఘటనలకు కారణంగా మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ తరహా ధోరణి పెచ్చరిల్లడంతో ప్రపంచానికే ఆదర్శంగా చెప్పుకునే భారత కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమౌతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సెలింగ్ తీసుకోవడం, కూర్చుని మాట్లాడుకోవడం, అవసరాన్ని బట్టి మానసిక వైద్యులను సంప్రదించడం ద్వారా దంపతుల మధ్య విద్వేషాలు, వివాదాలూ తీవ్ర నేరాల స్థాయికి చేరకుండా నివారించడానికి దోహదం చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దంపతుల మధ్య అవగాహన, సహనం పెరగడంతో పాటు చట్టపరమైన ప్రాసెస్ పై స్పష్టత ఉన్నప్పుడే సమాజంలో ఈ తరహా నేరాలు తగ్గుతాయని చెబుతున్నారు. Murders of husbands, extramarital affairs, Ekam Nyayam Foundation, domestic violence cases, Andhra Pradesh crime statistics
http://www.teluguone.com/news/content/murders-of-husbands-36-226816.html





