బేగం బజార్‌లో మోస్ట్ వాంటెడ్ దొంగ అరెస్ట్.. భారీగా నగదు, గోల్డ్ స్వాధీనం
Publish Date:May 18, 2026
Advertisement
హైదరాబాద్ నగరంలో వరుస ఇండ్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుడిని బేగం బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.30 లక్షల విలువైన 206 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,14,600 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమర్ సోన్ కాంబ్లే (20) మహారాష్ట్ర రాష్ట్రంలోని లాతూర్ జిల్లా ఉద్గీర్ గ్రామానికి చెందినవాడు. జీవనోపాధి కోసం అతని తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వచ్చి కిషన్‌బాగ్ ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకున్నారు. అమర్ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాడు. తండ్రి మరణంతో చదువును మధ్యలోనే ఆపేసి, ఫంక్షన్ హాళ్లలో వెయిటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే చిన్న వయసులోనే మద్యం, సిగరెట్లు, పబ్బుల వంటి విలాసవంతమైన అలవాట్లకు బానిసైన అమర్‌కు వచ్చిన ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీల మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. అతనిపై ఇప్పటికే మూడు చోరీ కేసులతో పాటు ఒక పోక్సో కేసు కూడా నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 6వ తేదీ తెల్లవారుజామున గోషామహల్ హిందీనగర్‌లోని ఓ ఇంట్లో తాళాలు పగులగొట్టి భారీ చోరీ జరిగిన ఘటనపై కేసు నమోదైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు 235 గ్రాముల బంగారం, రూ.10 లక్షల నగదు దొంగిలించబడినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి మే 17న అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో దొంగిలించిన ఆస్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
http://www.teluguone.com/news/content/most-wanted-thief-arrested-in-begum-bazaar-36-220146.html





