మోదీ పాలనకు పదకొండేళ్లు!
Publish Date:May 27, 2025
Advertisement
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన 11 ఏళ్ళు పూర్తిచేసుకుని,12 వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. అవును.. 2014 మే 26న నరేంద్ర మోదీ ప్రప్రథమంగా భారత ప్రధాని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో వంక మరో వారం పది రోజుల్లో.. అంటే జూన్ 9 న మోదీ 3.0 ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుకునేందుకు సిద్దమవుతోంది. గత ఏడాది జూన్ 9 న నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన తొలి ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. అలాగే.. నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక కాలం ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధనిగానూ మోదీ చరిత్ర సృష్టించారు. అదలా ఉంటే.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనను అప్రకటిత అత్యవసర పాలనగా అభివర్ణించారు. అలాగే ఈ పదకొండేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించింది శూన్యమని తేల్చేశారు. మోదీ సర్కార్ కు ఖర్గే జీరో మార్కులు వేశారు. మరో వంక బీజేపీ, ఎన్డీఎ భాగసామ్య పార్టీలు మోదీ పాలన భేష్ అని మెచ్చుకుంటున్నాయి. ఈ 11 ఏళ్లలో సాధించిన ఆర్థిక ప్రగతిని, ఇతర విజయాలను ఏకరవు పెడుతున్నాయి. నూటికి 200 మార్కులు ఇచ్చినా ఇవ్వవచ్చు అన్నట్లుగా మోదీ పాలను ప్రశంసల వర్షంలో ముంచెత్తుతున్నాయి. అయితే.. రాజకీయ విమర్శలను, రాజకీయ ప్రశంసలను పక్కన పెడితే.. మోదీ ఈ 11 ఏళ్ల పాలనలో మెరుపులూ, మరకలూ రెండూ ఉన్నాయి. అయితే.. గతంతో పోల్చుకుంటే మోదీ పాలన భిన్నంగా సాగింది అనేది మాత్రం కాదన లేని నిజం. నరేంద్ర మోదీ 2014 మే 26.. సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు భారత దేశ ప్రధాన మంత్రిగా తొలిసారి ప్రమాణాస్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మోదీ పాలన నిరాంటంకంగా కొనసాగుతోంది. వరసగా 2014, 2019, 2024 మూడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కూడా మోడీ సారధ్యంలో బీజేపీ, ఎన్డీఎ కూటమి అఖండ విజయం సాదించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశంలో సుస్థిర పాలన సాగుతోంది. నిజానికి మోదీ పాలనకు సుస్తిరత్వమే పునాది రాయి. సుస్థిర పాలనతోనే మోదీ ప్రభుత్వం సుస్థిర అభివృద్ధికి బాటలు వేసింది. సుస్థిర ప్రభుత్వం పునాదుల పైనే మోదీ ప్రభుత్వం తడబాట్లు సంకెళ్ళు లేకుండా.. దీర్ఘ కాలిక ప్రయోజనాలు లక్ష్యంగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. నిజమే.. మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు అన్నీ సంపూర్ణ విజయాన్ని సాధించలేదు. వ్యవసాయ చట్టాల వంటి కొన్ని కీలక నిర్ణయాలను అనివార్యంగా వెనక్కి తీసుకోవలసి వచ్చింది. అదే సమయంలో కోవిడ్ వంటి వైపరీత్యాలను ఎదుర్కుంటూ కూడా ఆర్థిక ప్రగతిలో లక్ష్యాలను చేరుకుంది. మోదీ తొలి ప్రమాణ స్వీకారం (2014) నాటికి 11 స్థానంలో దేశ ఉన్న ఆర్థిక వ్యవస్థ.. ఈ11 ఏళ్లలో నాలుగో స్థానానికి చేరుకుంది. అవును.. భారత ఆర్థిక వ్యవస్థ జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించింది. నిజానికి ఇది సామాన్య విజయం కాదు.. ప్రతి భారతీయుడూ గర్వించదగిన విజయంగా ప్రపంచ ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాదు.. త్వరలోనే భారత దేశం మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, మన కంటే ఎక్కవగా ప్రపంచ దేశాల ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. మరో వంక, మోదీ ప్రభుత్వం పేదరిక నిర్మూలన లక్ష్యంగా అమలు చేసిన సంక్షేమ, ఆర్థిక చేయూత పథకాలు, ఒకటొకటి వెలుగు లోకి వస్తునాయి. నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం.. మోదీ ప్రభుత్వం అమలు చేసిన పేదరిక నిర్మూలన పథకాల ద్వారా, దేశంలో ఇంతవరకు దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు. అలాగే మౌలిక సదుపాయాలరంగం,సాంకేతిక ఆవిష్కరణలు, అంతరిక్ష పరిశోధనలు, ముఖ్యంగా చంద్రయాన్ -3 మన దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. అయుష్మాన్ భారత్ వంటి, ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య పథకాలతో అత్యుత్త వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఒకటని కాదు.. ప్రతి ర్రంగంలోనూ ప్రపంచ స్థాయిని మించిన స్థాయిని చేరుకుందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ విశ్వాసంతో అడుగులు వేస్తోంది. మెరుగైన ఫ తాలు సాధిస్తూ, విశ్వగురు స్థానాన్ని చేరుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. నిజమే.. మోదీ ప్రభుత్వం ఎన్నో విజయాలను సాధించింది. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎన్నో దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి. కానీ, మోదీ ఒక విషయంలో మాత్రం ఓడిపోతూనే ఉన్నారు. విపక్షాల నుంచి ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నుంచి ఏ ఒక్క విషయంలోనూ మెప్పును అయితే పొందలేక పోయారు. ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి, దేశ ప్రజలు వరసగా మూడు సార్లు గెలిపించడం ద్వారా, మోదీని మెచ్చుకున్నారు. చివరకు చిదంబరం,శశి థరూర్ వంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం కొన్ని కొన్ని విషయాల్లో మోదీ భేష్ అంటున్నారు. కానీ, కాంగ్రస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం మోదీ పాలనలో మెచ్చుకో దగిన అంశం ఏదీ లేదని, 11 మోడీ పలాన్ టోటల్ ఫెయిల్యూర్, సంపూర్ణ వైఫల్యం అంటున్నారు.
ఇక దేశ భద్రత విషయానికి వస్తే.. ఆపరేషన్ సిందూర్అందుకు తిరుగులేని ప్రత్యక్ష సాక్ష్యం. నిజానికి, 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, 2019లో జరిగిన బాలకోట్ వైమానిక దాడి సందర్భంగా మన సైనిక శక్తి సామర్ధ్యాలు ప్రపంచానికి తెలిసి వచ్చాయి.ఇక ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా పాకిస్థాన్ కు బుద్ది చెప్పేందుకు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రపంచం కళ్ళు తెరిపించింది. మోదీ నాయకత్వంలో నిర్మాణ మవుతున్న నయా భారత్, స్వశక్తి సామర్ధ్యం ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలను, మట్టు పెట్టడంతో పాటుగా, పాక్ కవ్వింపు చర్యలకు జవాబుగా.. ఆ దేశంలో లోని 11 వైమానిక స్థావరాలను కూల్చివేయడం వరకూ మన సేనలు సాగించిన సాహసోపేతమైన చర్యలు భారతదేశ ప్రతిష్టను పెంచాయి.
http://www.teluguone.com/news/content/modi-complete-11-years-as-pm-25-198764.html





