బ్యూటీ పార్లర్లో రోజా సందడి.. విషయం ఏమిటంటే..?
Publish Date:May 18, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రోజాది ఆమెకే సాధ్యమైన ప్రత్యేక స్టైల్. పంచ్ డైలాగులతో ప్రత్యర్థులపై విరుచుకుపడినా, రాజకీయాలలో క్రియాశీలంగా ఉంటూ జబర్దస్త్ వంటి కామెడీ షోలలో హల్ చల్ చేసినా ఆమెకే చెల్లింది. వీటిపై వస్తున్న విమర్శలను ఆమె పెద్దగా పట్టించుకోరు. సినిమాల నుంచి రాజకీయాలలోకి వచ్చినా ఆమె తన స్టైల్ మార్చుకోలేదు. రాజకీయాలైనా, సినిమా అయినా గ్లామర్ ప్రాముఖ్యత ఆమెకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదు. తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ముఖ్యమంత్రి జగన్ ఆమెను కేబినెట్ లోకి తీసుకుని కీలకమైన పర్యాటక శాఖను కట్టబెట్టారు. రాష్ట్రంలో టూరిజం డెవలప్ మెంట్ కోసం ఏం చేయాలని ఆమె భావిస్తున్నారో ఇంకా తెలియదు కానీ, మంత్రి హోదాలో ఆమె తిరుపతిలో ఓ బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ కు హాజరై సందడి చేశారు. తిరుపతిలో కొత్తగా ఏర్పాటు చేసిన లండన్ బ్యటోరియం బ్రాంచ్ ను ఆమె ప్రారంభించారు. అంతేనా బ్యూటీ పార్లర్ అంతా కలియదిరిగి సందడి చేశారు. ఆ బ్యూటీ పార్లర్ లో ఒక కస్టమర్ గా తానూ నెయిల్ కటింగ్ చేయించుకున్నారు. బ్యూటీ టిప్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంత వరకూ చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమైన అత్యాధునిక బ్యుటీషియన్ సేవలు తిరుపతిలోనూ అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. మొత్తానికి తిరుపతిలో తన చేతుల మీదుగా ప్రారంభమైన బ్యూటీ పార్లరే మంత్రి హోదాలో ఆమె పాల్గొన్న తొలి కార్యక్రమంగా చెబుతున్నారు. ఈ బ్యూటీ పార్లర్ తిరుపతిలో ఓ టూరిస్ట్ స్పాట్ గా వెలుగొందుతుందని చెప్పకనే చెబుతున్నారు. కాగా బ్యూటీ పార్లర్ ఆమె సందడిని చూసిన వారు మాత్రం సినిమాలను వదిలేసినా గ్లామర్ ప్రాముఖ్యతను రోజా బాగా గుర్తు పెట్టుకున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/minister-roja-halchal-in-beauty-parlour-25-136049.html





