చంద్రబాబు టార్గెట్ గా కరకట్టపై కుట్ర... ఖాళీ చేయకపోతే కూల్చేస్తారా?
Publish Date:Sep 24, 2019
Advertisement
ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి నెలరోజులు కూడా కాకముందే కృష్ణా కరకట్టపై ప్రజావేదికను కూల్చివేయించి కలకలం రేపిన జగన్మోహన్ రెడ్డి... అసలు టార్గెట్ చంద్రబాబు నివాసముంటోన్న లింగమనేని గెస్ట్ హౌసేనని ప్రచారం జరిగింది. అయితే, ప్రజావేదిక కూల్చివేత తర్వాత కరకట్టపై నిర్మించిన నిర్మాణాలన్నింటికీ నోటీసులు ఇచ్చారు. కొందరు కోర్టులకు వెళ్లడంతో కూల్చివేతల కథ కొన్నిరోజులు ఆగింది. అయితే, కృష్ణా వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీ నుంచి ఒక్కసారిగా నీళ్లు వదిలి చంద్రబాబు నివాసాన్ని ముంచేయాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని టీడీపీ ఆరోపించింది. ఆ తర్వాత బాబు నివాసంపైకి డ్రోన్ల ప్రయోగం పెద్ద దుమారాన్నే రేపింది. అయితే, ఇవేమీ వర్కవుట్ కాకపోవడంతో తాజాగా చంద్రబాబు నివాసానికి మరోసారి నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో ఇంటిని ఖాళీ చేయాలని అందులో పేర్కొన్నారు. ఇలా నోటీసులు ఇచ్చిన తర్వాత కృష్ణా కరకట్టపై దాదాపు 24 అక్రమ కట్టడాల కూల్చివేతను సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. అయితే, చంద్రబాబు నివాసాన్ని కూడా కూల్చివేస్తున్నట్ల ప్రచారం జరిగినా, అలాంటిదేమీ లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కానీ వారం రోజుల్లో చంద్రబాబు ఆ ఇంటిని ఖాళీ చేయాల్సిందేనని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. అక్రమ కట్టడాలపై చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నామన్న బొత్స... ప్రతిపక్ష నేత చంద్రబాబు అక్రమ నిర్మాణాల్లో నివసించడం మంచిది కాదంటూ సూచించారు. బాబు నివాసముంటోన్న కట్టడాన్ని వారం రోజుల్లో తొలగించాలని నోటీసులు ఇచ్చామని, ఒకవేళ తొలగించకపోతే ప్రభుత్వమే కూల్చివేస్తుందంటూ మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి, నిజంగానే జగన్ ప్రభుత్వం అంత సాహసానికి ఒడిగడుతుందా? లేక బెదిరింపులతో సరిపెడుతుందో చూడాలి.
http://www.teluguone.com/news/content/minister-botsa-satyanarayana-comments-on-chandrababu-house-39-89415.html





