ఎగ్జిబిషన్లో అగ్నిప్రమాదం..రూ. 40 కోట్లు బుగ్గి పాలు
Publish Date:Jan 30, 2019
Advertisement
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోని నుమాయిష్‌లో గత రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 300 పైగా స్టాళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రూ. 40 కోట్ల వరకు ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవటంతో ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. వివరాలిలా ఉన్నాయి...రాత్రి 8.30గంటల సమయంలో పారిశ్రామిక ప్రదర్శనలోని ఓ స్టాల్లో విద్యుదాఘాతం సంభవించి మంటలు రేగాయి. వాటిని ఆర్పేసే లోపే మరో స్టాల్ కి వ్యాపించాయి. అధిక శాతం స్టాళన్నీ ప్లాస్టిక్, కర్రలు, తదితర వస్తువులతో రూపొందించడం... దుకాణాల్లో దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు వంటివి అధికంగా ఉండడంతో రెప్పపాటులో మంటలు ఎగసిపడ్డాయి. దుకాణాలు పక్కపక్కనే ఆనుకుని ఉండటం కూడా మంటలు త్వరత్వరగా విస్తరించటానికి కారణమయ్యింది. అగ్నిమాపక శకటాలు వచ్చేలోపే సుమారు వంద దుకాణాలకు నిప్పంటుకుంది. కొన్ని అప్పటికే పూర్తిగా ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న డీసీపీ విశ్వ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్, పోలీస్ సిబ్బంది సహాయంతో ఎగ్జిబిషన్‌లో ఉన్న వారిని బయటకు రప్పించారు. అగ్ని ప్రమాదం జరగటం, మంటలు విస్తరిస్తూ రావటంతో భయపడిన సందర్శకులు ప్రాణాలను కాపాడుకొనేందుకు ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వైపు పరుగులు తీశారు. మంటలను తప్పించుకుంటూ వెళ్లే క్రమంలో కొందరు సందర్శకులు తమ పిల్లలను చూసుకోకుండా వెళ్లిపోయారు. దీంతో పిల్లల ఏడుపులు, మహిళల హాహాకారాలతో ప్రాంగణం మార్మోగింది. మండుతున్న కర్రలు, ఇనుప వస్తువులు పడడంతో కొందరికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడ నెలకొన్న పొగ, ధూళి దాటికి పిల్లలు స్పృహ తప్పిపడిపోయారు. పోలీసులు వారిని అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. ఒకవైపు మంటలు వ్యాపించకుండా అడ్డుకుంటూనే సందర్శకులను సురక్షితంగా బయటకు పంపించటానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్‌ఎంసీ విపత్తు నివారణ బృందం తీవ్రంగా శ్రమించారు. రాత్రి 11.30 గంటల సమయంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ప్రమాదం జరిగినప్పుడు నుమాయిష్‌లో సుమారు 40వేల మంది సందర్శకులున్నారని పోలీసుల అంచనా. మరోవైపు నుమాయిష్ నుంచి బయటకు వచ్చిన వారు గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆర్టీసీ 84 ప్రత్యేక బస్సులు నడిపింది. మెట్రోరైల్‌లో ఉచితంగా ప్రయాణించవచ్చని మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ తదితరులు వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.అంజనీ కుమార్ అక్కడి నుంచే పరిస్థితిని సమీక్షించారు. స్వల్ప తొక్కిసలాట మినహా ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని కేర్ ఆసుపత్రికి తరలించామన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ రూ.40కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేశారు. మొత్తం 2500కు పైగా స్టాల్స్ ఉండగా.. దాదాపు 300 స్టాల్స్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/massive-fire-accident-in-nampally-exhibition-ground-39-85610.html





