కార్యరూపం దాల్చనున్న మచిలీపట్నం, రేపల్లె రైల్వేలైన్
Publish Date:May 15, 2026
Advertisement
ఏన్లో ఏళ్లుగా పేపర్లకు మాత్రమే పరిమితమైన మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైన్ పట్టాలెక్కబోతోంది. త్వరలో కేంద్ర కేబినెట్ ఆమోదంతో మొత్తం రూ.2,816 కోట్లతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చనుంది. కేబినెట్ ఆమోదం తరువాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 47.60 కిలోమీటర్ల పొడవున ఆరు కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. మచిలీపట్నం , రేపల్లె మధ్య రైల్వేలైన్‌లో మొత్తం 70 బ్రిడ్జిలు, 24 అండర్ బ్రిడ్జిలు రానున్నాయి. దశాబ్దాలుగా కలగా మిగిలిన ఈ రైల్వేలైన్ సాకారం కానుందన్న వార్తతో ఆ ప్రాంతం వాసుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. మచిలీపట్నం, రేపల్లె కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే రైల్వే బోర్డు అనుమతితో ఫైనల్ లోకేషన్ సర్వేతో పాటుగా డీపీఆర్‌ను కేంద్రానికి అందించారు. ఇప్పటికే ఈ రైల్వేలైనుకు సంబంధించి సర్వే పూర్తిచేసి డీపీఆర్‌ను రైల్వే బోర్డు ఆమోదానికి పంపినట్లు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తెలిపారు. త్వరలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేయగానే పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇప్పటికే రైల్వేశాఖ అట్లాస్‌లో సర్వే రూట్ మ్యాప్‌ను అధికారికంగా అప్లోడ్ చేసిందని వివరించిన బాలశౌరి, ఈ ప్రాజెక్టు ఆమోదానికి సహకరించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్టు కోసం ఈ రూట్లోని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇటీవల మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లోక్‌సభలో ఈ రైల్వే లైన్ అంశాన్ని ప్రస్తావించారు.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా కలిసి పనులు చేపట్టాలని కోరారు. మొత్తానికి కొత్త రైల్వే లైన్ పట్టాలెక్కబోతోంది. కొత్త రైల్వే లైన్లో పెనుమూడి, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, మాజేరు, రుద్రవరం సహా మొత్తం ఆరు రైల్వే స్టేషన్లను ప్రతిపాదించారు. నాలుగేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త రైల్వే లైన్ మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తయ్యేలోపు అందుబాటులోకి వస్తే చాలా ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ రైల్వే లైన్లో సరుకు రవాణా కూడా సులభతరం అవుతుందంటున్నారు. అలాగే విజయవాడ జంక్షన్‌పై చాలా వరకు భారం తగ్గుతుందంటున్నారు. ఈ రైల్వే లైన్ పూర్తిచేస్తే కోల్‌కతా-చెనై రూట్లో నడిచే రైళ్లు మచిలీపట్నం మీదుగా వెళితే 55 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటుగా విజయవాడ జంక్షన్‌పై భారం తగ్గుతుంది.
http://www.teluguone.com/news/content/machilipatnam-repalle-railway-line-set-to-become--reality-36-219869.html





