ప్రేమ వివాహం.. విభేదాలు.. చివరికి విషాదాంతం!
Publish Date:May 15, 2026
Advertisement
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పరిధిలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కొహెడ గ్రామంలో చోటుచేసుకున్న ఓ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలు, మోసం ఆరోపణల నేపథ్యంలో గోవర్ధన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సమాచారం ప్రకారం, గోవర్ధన్ నాలుగేళ్ల క్రితం సరిత గౌడ్ అనే యువతిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం వీరికి ఒక మగబిడ్డ జన్మించాడు. మొదట సవ్యంగా సాగిన వారి దాంపత్య జీవితం, కాలక్రమేణా విభేదాలకు దారి తీసింది. తరచూ గొడవలు జరుగుతుండటంతో సరిత కొంతకాలం తర్వాత గోవర్ధన్‌ను వదిలి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాకుండా, తమకు జన్మించిన బిడ్డను ఇతరులకు అప్పగించి, మరో వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు గోవర్ధన్‌కు తెలిసిందని సమాచారం. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన గోవర్ధన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు గోవర్ధన్ ఒక సూసైడ్ నోట్ రాయడంతో పాటు తన మొబైల్ ఫోన్‌లో సెల్ఫీ వీడియో కూడా రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన నాలుగు రోజుల తర్వాత బయటపడటం మరింత విషాదాన్ని మిగిల్చింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గోవర్ధన్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అందులోని వీడియోలు, ఫోటోలు, రికార్డులు, సూసైడ్ నోట్‌ను పరిశీలిస్తున్నారు. అన్ని ఆధారాలను సేకరించిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. గోవర్ధన్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముఖ్యంగా అతని తల్లి మీడియా ముందు విలపిస్తూ, తమ మనవడిని తమకు అప్పగించాలని వేడుకుంది. ప్రస్తుతం బిడ్డ ఎక్కడ ఉన్నాడనే విషయం తెలియకపోవడం కుటుంబాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సరిత గౌడ్ వివరాలను పూర్తిగా సేకరిస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపగా, గోవర్ధన్ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/love-marriage-in-koheda-village-36-219892.html





