సీఎస్ సోమేష్ కు ఉద్వాసనేనా?.. సీఎం విశ్వాసం కోల్పోయారా?
Publish Date:May 4, 2022
Advertisement
సీఎస్ సోమేష్ కుమార్ కు ఉద్వాసన తప్పదా? ఎంతో నమ్మకంతో సీఎం కేసీఆర్ ఏరి కోరి తెచ్చుకున్న సోమేష్ కుమార్ ఇప్పుడు ఆయన నమ్మకాన్ని కోల్పోయారా? అంటే అధికార వర్గాల్లో ప్రచారం మేరకు ఔననే సమాధానం వస్తున్నది. ఏపీ క్యాడర్ కు చెందిన వ్యక్తే అయినప్పటికీ సోమేష్ కుమార్ క్యాట్ ఆర్డర్స్ మేరకు తెలంగాణలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన వ్యవహార శైలి సీఎంకు పెద్దగా నచ్చుతున్నట్లు కనబడదు. అంతే కాకుండా సీఎంలు, చీఫ్ జస్టిస్ ల సదస్సులో సీఎస్ సోమేష్ వ్యవహార శైలిపై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. సీఎం కేసీఆర్ ఆయనకు ఉద్వాసన పలకడమే మేలని నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాల్లో ప్రచారమౌతోంది. విధి నిర్వహణలో సీఎస్ నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నారని ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సీఎం స్వయంగా చెప్పన అంశాల అమలులో కూడా అలవిమాలిన జాప్యం జరుగుతోంది. ఈ విషయంలో సీఎం సీఎస్ తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఎంతో నమ్మకంతో డజను మంది సీనియర్లను సైతం తోసి రాజని ఏరి కోరి సోమేష్ కుమార్ ను సీఎస్ గా సీఎం కేసీఆర్ తెచ్చుకున్నారు. సీనియారిటీ లేని వ్యక్తికి సీఎస్ పదవి ఏమిటని రేవంత్ వంటి ప్రతిపక్షాల నేతలు ఎన్ని మార్లు ఆరోపణలు, విమర్శలు చేసినా సీఎం కేసీఆర్ ఖాతరు చేయలేదు. అయితే ఇప్పుడు సీఎస్ వ్యవహార శైలి పట్ల స్వయంగా సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. సీఎస్ వ్యవహారశైలి, నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వాని సమస్యలు వస్తున్నాయని కేసీఆర్ భావిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో సీజేఐ సీఎస్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇక ఉద్వాసన చెప్పక తప్పదని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారంటున్నారు. సీఎస్ సోమేష్ కుమార్ స్థానంలో ప్రస్తుతం ఆర్థిక శాఖలో బాధ్యతలు నిర్వహిస్తున్న రామకృష్ణారావుకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/lost-confidence-in-somesh-will-co-oost-cs-somesh-39-135398.html





