రాహుల్ గాంధీ నిజంగానే నైట్ క్లబ్ లో ఎంజాయ్ చేశారా?
Publish Date:May 4, 2022
Advertisement
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వ్యక్తి అయిన రాహుల్ గాంధీ నేపాల్ పర్యటనలో నిజంగానే నైట్ క్లబ్ లో ఎంజాయ్ చేశారా? బీజేపీ విడుదల చేసి రచ్చ చేస్తున్న వీడియోల వెనుక అసలు కథ ఏమిటి? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ ఆయన వెళ్లింది ఒక వివాహానికని చెబుతున్న మాటలలో నిజమెంత? ఇంతకీ ఆ వీడియోలలో కనిపిస్తున్న యువతి ఎవరు? ఆమెకూ రాహుల్ గాంధీకీ సంబంధం ఏమిటి? వీటన్నిటికీ సమాధానాలు తెలియాలంటే...బీజేపీ చెబుతున్నట్లుగా రాహుల్ గాంధీ ఎంజాయ్ చేస్తున్న నైట్ క్లబ్ లో రాహుల్ గాంధీతో ఉన్న యువతి ఎవరన్నది తెలియాలి. ఆమె పేరు సుమ్మిమా ఉదాస్. నేపాలీ అయిన ఆమె ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎస్ ఇంటర్నేషనల్ కు ఢిల్లీ ప్రతినిథిగా పని చేశారు. ఆ సమయంలో ఆమె దేశంలో రాజకీయ, ఆర్థిక, పర్యావరణ, సామాజిక అంశాలకు సంబంధించి పలు ఆసక్తికర కథనాలతో సంచలనాలు ష్టించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ గ్యాంగ్ రేప్ కేసుపై ఆమె కథనాలు అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. అలాగే 2014 సార్వత్రిక ఎన్నికలను కూడా ఆమె సీఎన్ఎన్ ఇంటర్నేషనల్ ఢీల్లీ ప్రతినిథిగా కవర్ చేశారు. రాహుల్ గాంధీకి ఆమె మంచి ఫ్రెండ్. ఆమె వివాహానికి హాజరయ్యేందుకే రాహుల్ నేపాల్ వెళ్లారు. ఆమె వివాహం గురువారం జరగనుంది. అందుకు సంబంధించిన రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఆ రిసెప్షన్ వేడుకలలో రాహుల్ పాల్గొన్న ఫొటోలే సామాజిక మాధ్యమంలో బీజేపీ పోస్టు చేసింది. అవి వైరల్ అయ్యి రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. రాహుల్ గాంధీ తమ ఆహ్వానం మేరకే ఖాట్మండూ వచ్చారని సుమ్మిమా ఉదాస్ తండ్రి భీమ్ ఉదాస్ తెలిపారు. ఆయనా సామాన్యుడేమీ కాదు. దౌత్య అధికారిగా పనిచేశారు. మయన్మార్ లో నేపాల్ రాయబారిగా సేవలందించారు. అసలు సంగతి ఇలా ఉంటే బీజేపీ కాదేదీ రాజకీయ రచ్చకు అనర్హం అన్నట్లుగా కొన్ని వడియోలను సోషల్ మీడియాలో వదలి రాజకీయ రచ్చ చేసింది. దేశంలో ఎలక్షన్ హీట్ ఉన్న సమయంలో ప్రత్యర్థి పార్టీలను బలహీన పరచడమే లక్ష్యంగా ఈ చర్యకు పాల్పడిందని కాంగ్రెస్ విమర్శలు కురిపిస్తున్నది. వివాహానికి వెళ్లడమే బీజేపీ దృష్టిలో నేరమా అని నిలదీస్తున్నది. ఇలా ఉంటే దేశంలో క్రమంగా కాంగ్రెస్ బలపడుతోందన్న భావనతోనే కాంగ్రెస్ పై బురదజల్లి బలహీనపరిచే ఉద్దేశంతో బీజేపీ ఈ రాద్ధాంతం చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద రాహుల్ నేపాల్ పర్యటన రాజకీయ రాద్ధాంతానికి కారణమైంది.
http://www.teluguone.com/news/content/did-rahul-really-enjoyed-in-night-club-39-135408.html





