తమిళనాడు అసెంబ్లీలో కుప్పం ఎయిర్ పోర్టు ప్రస్తావన.. లింకేంటి?
Publish Date:Aug 13, 2026
Advertisement
ఏపీ సీఎం చంద్రబాబు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ముందుు సాగుతున్నారు. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటు చేయతలపెట్టింది. అయితే కుప్పంలో ఏపీ ప్రభుత్వంనిర్మించతలపెట్టిన విమానాశ్రయం తమిళనాడు రాజకీయాల్లో హీట్ పెంచింది. తమిళనాడుఅసెంబ్లీ వేదికగా హోసూరు విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణంపై జరిగిన చర్చలో కుప్పం విమానాశ్రయం ప్రస్తావనకు వచ్చింది. శాసనసభలో ఎడీఎంకే మ్మెల్యే ఈ ఆరోపణలను తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి తోసిపుచ్చారు. హోసూరు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టును ఇతర పొరుగు రాష్ట్రాలేవీ అడ్డుకోవడం లేదంటూ.. సోషల్ మీడియా ప్రచారాలనూ, నిరాధార వార్తలనూ నమ్మి అసెంబ్లీ వేదికగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని మంత్రి నిష్కర్షగా చెప్పారు. హోసూరు విమానాశ్రయ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఆధారాలతో మాట్లాడాలన్నారు. అసలు కుప్పంలో విమానాశ్రయం, హోసూరు ఎయిర్ పోర్టులకు లింకేంటి? కుప్పం విమానాశ్రయం గురించి తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేవనెత్తిన అభ్యంతరమేంటి? అంటే.. కుప్పం వద్ద విమానాశ్రయం నిర్మాణం చేపడుతుండటంతో ప్రాజెక్టుకు దాదాపు 1,788 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సుమారు 1,300 ఎకరాల భూసేకరణను పూర్తి చేసింది. ఈ ఎయిర్‌పోర్ట్‌ను క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ నమూనాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. విమానాశ్రయ నిర్మాణం, తదనంతర నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షించేలా నిర్ణయం జరిగింది. కుప్పం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు పరిసర సరిహద్దు ప్రాంతాల రూపురేకలు మారిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కుప్పం ప్రధాన లాజిస్టిక్స్ హబ్‌గా మారడమే కాకుండా, ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం పెరుగుతుంది. స్థానిక రైతులకు, ఉద్యానవన పంటల సాగుదారులకు ఈ విమానాశ్రయం ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. తాజా పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దేశ విదేశీ మార్కెట్లకు వేగంగా ఎగుమతి చేయడానికి దోహదపడుతుంది. ఒకే భౌగోళిక ప్రాంతానికి సమీపంలో ఉన్న కుప్పం విమానాశ్రయం అనుమతులు సాధించి పనుల్లో ముందంజ వేస్తుండగా.. హోసూరు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇదే తమిళనాడు రాజకీయాలలో కాకరేపుతోంది. Kuppam Airport, Tamil Nadu Assembly, Hosur Airport, Andhra Pradesh Infrastructure, Bengaluru Airport NOC
తమిళనాడు శాసనసభ సమావేశాల సందర్భంగా డిఎంకె ఎమ్మెల్యే శ్రీనివాసన్ హోసూరు ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమిళనాడులోని హోసూరు సమీపంలో ఎయిర్‌పోర్ట్ రాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ ఆరోపణలు చేశారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధితో పాటు పారిశ్రామిక పురోగతికి హోసూరు ఎయిర్‌పోర్ట్ కీలకమని, ఇతర రాష్ట్రాల వ్యూహాల వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోందని ఆయన ఆరోపించారు.
వాస్తవానికి హోసూరు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు పలు సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి హోసూరు అత్యంత సమీపంలో ఉంటుంది. విమానయాన నిబంధనల ప్రకారం ఒక ప్రధాన విమానాశ్రయానికి నిర్ణీత దూరంలో మరొక విమానాశ్రయాన్ని నిర్మించడంపై పరిమితులు ఉన్నాయి. దీనికితోడు హోసూరు ప్రాంతంలో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పరిశోధనా కేంద్రాలు, సంస్థలు ఉండటం వల్ల ఆ పరిసరాల్లో విమానాల రాకపోకలపై భద్రత దృష్ట్యా ఆంక్షలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల హోసూరు విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఇవ్వడానికి ముందు వెనుకలాడుతోంది.
అయితే బెంగళూరుకు సమీపంలోనే నిర్మించతలపెట్టిన ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు కు సంబంధించిన పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది. దీంతో కుప్పం విమానాశ్రయ సాధ్యాసాధ్యాల అధ్యయనం జాప్యం లేకుండా పూర్తయ్యింది.
http://www.teluguone.com/news/content/kuppam-airport-45-228833.html




