ఏపీలో రోడ్లు, కరెంట్ పై కేటీఆర్ కామెంట్- తెలంగాణలోని ఆంధ్ర ఓటర్లే టార్గెట్!
Publish Date:May 6, 2022
Advertisement
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయి ఎనిమిదేళ్లు గడిచిపోయింది. ఎనిమిదేళ్లుగా తెలంగాణలో ఒక్కటే పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే.. ఏపీలో మాత్రం తొలి ఐదేళ్లు చంద్రబాబు పాలిస్తే.. ఇప్పుడు మూడేళ్లుగా జగన్ ప్రభుత్వం నడుస్తుంది. విడిపోయిన రెండు రాష్ట్రాల ఆలనా పాలనలో పక్క రాష్ట్రాల నేతల ప్రభావం అంతగా లేనప్పటికీ ఉమ్మడి రాష్ట్రం నాటి భావోద్వేగాలు, సెంటిమెంట్లు ఇప్పటికీ అలాగే విలసిల్లడానికి రాజకీయం తన వంతు దోహదం చేస్తూనే ఉంది. మామూలు సమయాలలో వీటి తీవ్రత ఉనికి పెద్దగా కనిపించకపోయినా.. ఎన్నికలొస్తున్నాయంటే మాత్రం సెంటిమెంట్ మంత్రమే రాజకీయ పార్టీలకు, నాయకులకు గెలుపు మంత్రంగా ఉపయోగపడుతుంటుంది. ముఖ్యంగా ఈ సెంటిమెంట్ ను అనుకూలంగా వినియోగించుకోవడంలో తెలంగాణ మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఒక ఆకు ఎక్కువే చదివింది. తెలంగాణలో ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎక్కువే ఉన్నారు.. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడే స్థిరపడిన ఆంధ్రా ప్రజలు ఇప్పటి తెలంగాణలో కూడా చెప్పుదగ్గ స్థాయిలో ఇక్కడి రాజకీయాలను మలుపు తిప్పగలరు. దాదాపు పాతిక నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలరని కూడా ఇక్కడి రాజకీయాలలో ఓ లెక్క ఉంది. అందుకే తెలంగాణలో అధికారం దక్కాలంటే ఇక్కడ స్థిర పడిన వారి మద్దతు కోసం రాజకీయ పార్టీలు ఓ కన్నేసి ఉంచుతాయి. ఇలా స్థిరపడిన ఆంధ్రుల ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మలచుకోవాలంటే ఏపీలో పరిస్థితులను తెలంగాణ నాయకులు అర్ధం చేసుకోవాలి.. ఆ భావోద్వేగాలకు తగ్గట్లే నడుచుకోవాలి. టీఆర్ఎస్ పార్టీకి ఈ మనోభావాలను అర్ధం చేసుకోవడం.. భావోద్వేగాలను అనుకూలంగా మార్చుకోవడం వెన్నతో పెట్టిన విద్య.. గత ఎన్నికల సమయంలో కూడా ఏపీలో పరిస్థితులకు తగ్గట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడి ఆంధ్రుల మద్దతు పొందడం కోసమే.. నాడు ఏపీలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నచంద్రబాబుపై విమర్శలు చేశారు. అవినీతి, రెండు కళ్ల సిద్ధాంతంలో ఏపీ ప్రయోజనాలను దెబ్బతీశారంటూ, సెంటిమెంటును రెచ్చగొట్టడం ద్వారా ఇక్కడి ఆంధ్రుల మద్దతు పొందే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరో సారి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో కేటీఆర్ ఇక్కడ స్థిర పడిన ఆంధ్రుల్లో జగన్ పాలన పట్ల ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికే.. ఏపీలో రోడ్లు, విద్యుత్ పరిస్థితి అధ్వానంగా ఉంటే తెలంగాణలో అద్భుతంగా ఉన్నాయని అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై అక్కడా, ఇక్కడా కూడా హర్షామోదాలే వ్యక్తం అవ్వడమే ఇందుకు నిదర్శనం. ఏపీలో వైసీపీ తప్ప మరే పార్టీ వారు కానీ, జన సామాన్యం కానీ ఖండించలేదు సరికదా సమర్ధించారు. ఇక్కడ స్థిరపడిన ఆంధ్రులకు కూడా జగన్ నిర్వాకం వల్లే అక్కడి పరిస్థితులు అలా ఉన్నాయని కేటీఆర్ ను సమర్దించారే తప్ప ఏపీపై వ్యాఖ్యలేమిటని విమర్శలు చేయలేదు. గత ఎన్నికల్లో ఎలాగైతే ఏపీలో చంద్రబాబుపై వ్యతిరేకతను తెరాస ఇక్కడ ఓట్లుగా మార్చుకుందో.. అదే విధంగా ఈ సారి జగన్ పై అక్కడి వ్యతిరేకతను క్యాష్ చేసుకునే వ్యూహంతోనే కేటీఆర్ తెలంగాణతో ఏపీలో పరిస్థితులను పోలుస్తూ అభివృద్ధి చిరునామాగా తెలంగాణను తీర్చిదిద్దామని చెప్పుకున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు అక్కడా, ఇక్కడా అంటే ఏపీలోనూ, తెలంగాణలోనూ కూడా మద్దతు లభించిందంటే ఆయన వ్యూహం ఫలించినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ktr-target-ap-setelers-votes-in-telangana-by-commenting-on-roads-and-power-in-jagan-rule-25-135512.html





