కేటీఆర్ కు చెలగాటం కవితకు సంకటం
Publish Date:Oct 16, 2022
Advertisement
ఉరుము ఉరిమి మంగలం మీద పడడం అంటే ఇదే నేమో. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం రోజు రోజుకు వేడెక్కుతోంది. ముఖ్యంగా, మునుగోడు ఉప ఎన్నికను తమ రాజకీయ భవిష్యత్ ను నిర్ణయించే కీలక ఎన్నికగా భావిస్తున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కల్వకుట్ల తారక రామా రావు, దటీజ్ కేటీఅర్ ప్రధానంగా బీజేపీయే టార్గెట్ గా కత్తులు దూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మొదలు మునుగోడు బీజేపీ అభ్యర్ధి కోమటి రెడ్డి వెంకట రెడ్డి వరకు ఎవరినీ వదిలి పెట్టకుండా, విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నిజమే. సహజమే ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులపై విమర్శలు చేయడం సహజమే. కానీ, కేటీఆర్ స్థాయిని మరిఛి చేస్తున్న విమర్శలు, శృతి మించుతున్నాయి, చిక్కులు తెచ్చిపెడుతున్నాయని, అంటున్నారు. ఒక విధంగా కేటీఆర్ విమర్శలు ఇటు పార్టీని, పార్టీ నాయకులను,మరీ ముఖ్యంగా కల్వకుట్ల కుటుంబాన్నిచిక్కుల్లోకి నేట్టేస్తోందని అంటున్నారు. ఓ వంక, సోదరి, తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని వార్తలొస్తున్నాయి. అదే సమయంలో కేటీఆర్ చేస్తున్న విమర్శలు బీజేపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయని తెరాస నాయకులే గుసగుసలు పోతున్నారు. ఇది పార్టీకు, ఫ్యామిలీకి ఇద్దరికీ మంచిది కాదని, అంటున్నారు. రాజకీయాలలో రాణించాలంటే, ఎక్కడ ఎక్కాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసుండాలి, నిజానికి కేసీఆర్ విజయ రహస్యం అదే. ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్, బ్లో హాట్ అండ్ బ్లో కోల్డ్ పాలసీనే ఫాల్లో అవుతూ వచ్చారు. గిట్టని వాళ్ళు కొందరు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, అంటారు అయినా కేసీఆర్ అదే పాలసీనే ఫాలో అవుతున్నారని అంటారు. ఇప్పుడు కూడా కేసేఆర్ కుమార్తె కవితను వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్లి, అక్కడే ఉన్నారు. ఆయన ఢిల్లీ యాత్రకు, కవిత కేసుకు సంబంధం వుందో లేదో, కానీ, ఢిల్లీ లిక్కర్ కేసులో బోయినపల్లి అభిషేక్’ను సీబీఐ అదుపులోకి తీసుకున్నవెంటనే కవిత, సంతోష్ను వెంటపెట్టుకుని ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు. నిజానికి, ‘నువ్వు గోకినా గోకకున్నా, నిన్ను నేను గోకుతూనే ఉంటాను’ అంటూ ప్రధాని మోడీని పేరు పెట్టి మరీ హెచ్చరించిన కేసేఆర్, ఇంచు మించుగా గడచిన వారం రోజులుగా ఢిల్లీలో ఉండి కూడా మోడీని ఒక్క సారి కూడా గోకలేదు. ఒక్క మాట కూడా అనలేదు. అలాగని ఆయన కవిత లిక్కర్ కేసు విషయంలో భయపడుతున్నారని అనలేము అలాగే అనకుండానూ ఉండలేమని అంటున్నారు. సమస్యలు చుట్టు ముట్టినప్పుడు మౌనాన్ని ఆశ్రయించడం కేసీఆర్ అడాప్ట్ చేసుకున్న విధానమని ఆయన ప్రస్తుత మౌనం కూడా అందుకు సంకేతం కావచ్చని అంటున్నారు. అయితే కేసీఆర్ గోకుడు ఆపేసినా, అనూహ్యంగా మునుగోడు బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నకేటీఆర్ మాత్రం గోకుడు ఆపలేదు. మోడీ.. బోడీ.. ఈడీ.. దేనికైనానా రెడీ అంటూ ప్రధాని మోడీని దూషించిన కేటీఆర్, కోమటి రెడ్డి బ్రదర్స్గా పాపులర్ అయిన మునుగోడు బీజేపీ అభ్యర్ధి, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డిని కలిపి వారు ‘కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు కోవర్ట్ బ్రదర్స్’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అటు నుంచి కౌంటర్ గట్టిగానే వచ్చింది. కల్వకుట్ల కుటుంబం కమీషన్ల కుటుంబం అంటూ కోమటి రెడ్డి సోదరులు ఇద్దరూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అంటే కాకుండా బీజేపీ నాయకులు మొత్తంగా కల్వకుట్ల ఫ్యామిలీ టార్గెట్’గా పాత పురాణాలు అన్నీ బయట పెడుతున్నారు. అందులో భాగంగానే, రాజగోపాల రెడ్డి, తాజాగా, “ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని 600 మద్యం దుకాణాల్లో వాటా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెతోపాటు కేసీఆర్ హస్తం కూడా ఉంది. కవిత అవినీతిపై ఇప్పటికే సీబీఐ విచారణ జరుగుతోంది. వచ్చే బతుకమ్మ వేడుకలను ఆమె తీహార్ జైల్లోనే జరుపుకోవాల్సి ఉంటుంది’’ అని అన్నారు. మరోవంక సీబీఐ, ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణను వేగం పెంచింది. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రిక్’గా విచారణ సాగిస్తోంది. సీబీఐ అదుపులో ఉన్న బోయినపల్లి అభిషేక్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన గతంలో కవితకు వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీంతో, ఏ క్షణానికి ఏమి జరుగుతుందో, అనే అనుమానం తెరాస నాయకులను,వెంటాడుతోంది. అయితే, కేటీఆర్ మాత్రం తగ్గేదేలే... అంటూ తన దారిలో తాను బీజేపీ నాయకులను తమదైన ధోరణిలో విమర్శిస్తూనే ఉన్నారు. అందుకే, కేటీఆర్ ధోరణి, పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్న విధంగా మారిందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/ktr-aggression-trouble-to-kavitha-39-145522.html





