కోఠి మహిళా వర్సిటీ మెస్ ఇంఛార్జ్ సస్పెండ్
Publish Date:Dec 16, 2025
Advertisement
కోఠి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ మెస్ ఇంఛార్జ్ వినోద్‌ను ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థనులను వేధిస్తున్నాడు అంటూ వినోద్ పై ఆరోపణలు వచ్చాయి. హాస్టల్ లో చదువుతున్న విద్యార్థినులే షీ టీమ్‌కు ఫోన్ చేసి వినోద్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. అతడి ప్రవర్తన ఇబ్బందికరంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. యాజమాన్యం కూడా అతడికే మద్దతుగా ఉందని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని విద్యర్థులు షీ టీమ్‌తో వాపోయారు. తమను పర్సనల్ గా టార్గెట్ చేస్తారనే కారణం కంప్లైంట్ చేయలేకపోతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. రంగలోకి దిగిన షీ టీమ్ ప్రిన్సిపాల్‌ను ఘటనపై ఆరా తీసింది. అయితే మొదట ప్రిన్సిపాల్ మీడియాతో మాట్లాడుతూ తమకు వినోద్ పై విద్యార్థినుల నుండి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. మరోవైపు యూనివర్సిటీలో పీజీ విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు. వేధింపుల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న షూటింగ్స్ కారణంగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థినులు ఆరోపించారు. ముఖ్యంగా వర్కింగ్ డేస్‌లో షూటింగ్స్‌కు అనుమతిస్తే సెక్యూరిటీ గార్డులు వేధింపులకు గురిచేస్తు న్నారని వారు వాపోయారు. గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ షూటింగ్ సమయంలో క్యారీ వాన్‌లో విద్యార్థినులను నిర్బంధించారని ఆరోపిస్తూ విద్యార్థినులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. షూటింగ్స్ వల్ల చదువుకు ఆటంకం కలుగుతోందని, భద్రతా సమస్యలు కూడా తలెత్తుతున్నాయని వారు తెలిపారు. ఈ క్రమంలో షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వకూడదని, అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చినా శని, ఆదివారాల్లో మాత్రమే అనుమతించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థిను లను వేధింపులకు గురిచేస్తున్న వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో యూనివర్సిటీ ప్రిన్సిపల్ స్పందించారు. ఇకపై షూటింగ్స్‌కు శని, ఆదివారాల్లో మాత్రమే అనుమతి ఇస్తామని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు. వర్కింగ్ డేస్‌లో షూటింగ్స్‌కు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. వీసీని కలిసేందుకు పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నాయకులు సైతం తరలి వచ్చారు. మరోవైపు యూనివర్సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విశ్వవిద్యాలయంలో పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
http://www.teluguone.com/news/content/kothi-womens-university-36-211091.html





