కాషాయి కండువా కప్పుకోనున్నకొండా దంపతులు?
Publish Date:May 7, 2022
Advertisement
వరంగల్ రాజకీయాల్లో రెబల్ జంట కొండా సురేఖ- మురళి దంపతులు. రాజకీయాల్లో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ప్రజాప్రతినిధులుగా తమ మార్క్ ఏంటో చూపించారు. వరంగల్ రాజకీయాల్లో ఈ పొలిటికల్ దంపతులది ఓ ప్రత్యేక స్థానం. జిల్లా రాజకీయాల్లోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ జోడీ సంచలనాలే సృష్టించిందని చెప్పాలి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొండా సురేఖ దంపతులు ఓ వెలుగు వెలిగారు. వైఎస్ మరణానంతరం ఆయన కొడుకు జగన్ కు అండగా నిలబడిన కొండా దంపతులు ఆనక ఆయనతో పడక వైసీపీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ అధినేతతో విభేదించి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. కరీంనగర్ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల తర్వాత కొండా దంపతులు మళ్లీ మౌనమే తమ భాషగా చేసుకున్నారు. తాజాగా కొండా దంపతులు మళ్లీ కాషాయం కండువా కప్పుకోనున్నారనే ఊహాగానాలు సర్వత్రా వస్తున్నాయి. కొండా మురళి- సురేఖ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ఏకైక కుమార్తె సుస్మితా పటేల్. కొండా సురేఖ వరంగల్ రూరల్ జిల్లా ఊకల్ లో 1964 ఆగస్టు 19న తుమ్మ చంద్రమౌళి- రాధ దంపతులకు పుట్టారు. పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో డిగ్రీ చదివారు. కొండా మురళి 1963 అక్టోబర్ 23న కొండా చెన్నమ్మ- కొమురయ్య పటేల్ దంపతులకు జన్మించారు. మురళి స్వస్థలం వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి. మురళి 1987లో వంచనగిరి గ్రామ సర్పంచ్ గా రాజకీయ జీవితం ప్రారంభించగా.. సురేఖ 1995లో మండల పరిషత్ కు ఎన్నికవడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కొండా మురళి వరంగల్ ఎమ్మెల్సీగా రెండుసార్లు ఎన్నికయ్యారు. సురేఖ 1996 నుంచి కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు నిర్వహించారు. శాయంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో మరోసారి శాయంపేట నుంచే అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో పరకాల అసెంబ్లీ సెగ్మెంట్ లో గెలిచి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, బధిరుల సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్ మరణం తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్ పెట్టినందుకు, జగన్ కు సీఎం పదవి ఇవ్వనందుకు నిరసనగా 2011 జులై 4న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2012 జూన్ 12న జరిగిన పరకాల ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. మరో 13 నెలలకే ఆమె వైసీపీకి కూడా గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి వరంగల్ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా సురేఖ ప్రస్తుతం అక్కడ కూడా కొద్ది రోజులుగా మౌనంగా ఉంటున్నారు. కొండా సురేఖ చురుకైన మహిళా రాజకీయ నాయకురాలు. మండల పరిషత్ సభ్యురాలిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆమె నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంచి వాక్పటిమ, వాగ్దాటి గల సురేఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అధికారపీఠం అధిరోహించాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ.. వరంగల్ జిల్లా నుంచి బలమైన రాజకీయ నేత కోసం అన్వేషిస్తోంది. వరంగల్ జిల్లాలో బలమైన నేతలుగా, మంచి క్యాడర్ ఉన్న కొండా దంపతులపై దృష్టి సారించినట్లు సమాచారం. త్వరలోనే కొండా దంపతులను బీజేపీలోకి ఆహ్వానించాలని రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొండా కపుల్ కు రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని బీజేపీ నుంచి ఆఫర్ కూడా వచ్చినట్లు సమాచారం. అయితే.. తాము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొండా దంపతులు కొట్టిపారేయడం గమనార్హం. నిజానికి రెండు ఎమ్మెల్యే సీట్ల డిమాండ్ కొండా దంపతులు ఎప్పటి నుంచో చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో కొండా సురేఖను దింపాలని టీపీసీసీ యత్నించింది. అయితే.. అందుకు ప్రతిగా వచ్చే ఎన్నికల్లో తమకు వరంగల్ జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని హామీ ఇస్తేనే హుజురాబాద్ లో పోటీ చేస్తానని సురేఖ కండిషన్ పెట్టినట్లు మీడియా వార్తలు వచ్చాయి. తమ కుమార్తె సుస్మితా పటేల్ ను బరిలో దింపాలనే ప్రయత్నాలు కొండా దంపతులు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఆ క్రమంలోనే వారు రెండు సీట్ల డిమాండ్ చేస్తుండడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి పెట్టిన డిమాండ్ నే బీజేపీకి కూడా కొండా దంపతులు పెట్టడం గమనార్హం. దాని వెనుక తమ కుమార్తెను రాజకీయ వారసురాలిగా ప్రత్యక్షరాజకీయాల్లోకి తీసుకురావాలనే ప్రగాఢమైన కోరిక వారికి ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి సురేఖ బరిలో ఉంటారని, మరో సీటు ఇస్తే.. తమ కుటుంబంలో ఇద్దరం రెడీగా ఉన్నామని కొండా మురళి చెబుతుండడం విశేషం. అది కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కష్టం అనుకున్న స్థానంలో సీటు ఇచ్చినా బరిలో దిగేందుకు తాము రెడీ అనడం గమనార్హం. మంత్రిగా సురేఖ, ఎమ్మెల్సీగా మురళి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సేవలందించారు. ప్రజల మధ్య గడిపిన చరిత్ర వారిది. సామాన్యులు, కార్యకర్తలకు కష్టం వస్తే అండగా ఉంటారనే మంచి పేరు ఉంది. వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో వీరికి మంచి పట్టు ఉంది. అయితే.. పరకాల నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ కాంగ్రెస్ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. ఇంతకు ముందు జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొండా దంపతుల హవా ఏమీ కనిపించలేదు. తూర్పు నియోజకవర్గంలో ఒక్క కార్పొరేటర్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కలేదంటే కొండా దంపతుల ప్రాబల్యం తగ్గిందని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వారు కాంగ్రెస్ నుంచి బరిలో దిగినా.. లేదా బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసినా.. వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఇప్పుడే అంచనాకు అందని విషయం.
http://www.teluguone.com/news/content/konda-durekha-25-135585.html





