పూర్తిగా ఆరిపోయిన బ్లో అవుట్ మంటలు
Publish Date:Jan 10, 2026
Advertisement
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఔట్ మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు పూర్తిగా ఆరిపోవడంతో ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందం శకలాలను పూర్తిగా తొలగించింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతోనే ఓఎన్జీసీ సిబ్బంది మంటలార్పారు. మలికిపురం మండలం ఇరుసుమండ సమీపంలో ఈనెల 5న ఓఎన్జీసీ యాజమాన్యంలోని మోరి-5 బావిలో గ్యాస్ లీక్ కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దాదాపు 20 మీటర్ల ఎత్తు భారీ అగ్నికీలలు ఎగిసి పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటల నేపథ్యంలో ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం గ్రామాలకు చెందిన సుమారు 500- 600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. కాగా, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. జిల్లా అధికారులు, ఓఎన్జీసీని సమన్వయం చేసి మంటలను అదుపు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మంటలను అధికారులు అదుపులోకి తెచ్చారు. బ్లోఔట్ అదుపులోకి రావటంతో ఓఎన్జీసీ నిపుణులు సంబరాలు చేసుకున్నారు. బ్లోఔట్ ప్రాంతంలో స్వీట్స్ తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే బ్లోఔట్ అదుపులోకి రావటంతో ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం గ్రామ ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై ఓఎన్జీసీ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని స్థానిక గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/konaseema-district-36-212345.html





