అబ్బ...ఆయనే గుర్తొస్తున్నారు..
Publish Date:Nov 3, 2014
Advertisement
ఈ మధ్యన ఏమిటో తరచూ ఆయనే అందరి కలల్లోకి వస్తున్నారుట! ఆయన అనగానే స్వర్గీయ యన్టీఆరో..లేక స్వర్గీయ రాజశేఖ రెడ్డో అనుకొనేరు...రాష్ట్ర విభజనని తీవ్రంగా వ్యతిరేఖిస్తూ పోరాడిన వ్యక్తి. అలాగని జగన్మోహన్ రెడ్డి అనుకొనేరు...స్మీ! చివరి దాక రాష్ట్ర విభజనని, ఆ నిర్ణయం తీసుకొన్న తన కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించిన వ్యక్తి...మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు తరచుగా అందరి కలల్లోకి వస్తున్నట్లు తెగ ప్రచారం అవుతోంది. ఆనాడు రాష్ట్ర విభజన చేస్తే నీళ్ళ కోసం కరెంటు కోసం గొడవలొస్తాయని చిలక్కి చెప్పినట్లు చెప్పారు. కానీ ఆయన మాటేవరూ చెవికెక్కించుకోలేదు. రాష్ట్రాన్ని విభజిస్తే పార్టీ మట్టి కొట్టుకుపోతుందని అరిచి గ్గీ పెట్టారు, కానీ ఆయనే పార్టీకి ఎసరు పెట్టేలా ఉన్నారని సాటి కాంగ్రెస్ జీవులన్నీ అప్పుడు చెవులు కొరుకొన్నాయి. ఆయన వేరు కుంపటి పెట్టుకొని బయటకు వెళ్ళిపోయిన తరువాత ఆయనిక మళ్ళీ పార్టీలోకి తిరిగి రాడనీ రూడీ చేసుకొన్నాక, ఆ చెవులు కొరుకొన్న కాంగ్రెస్ జీవులన్నీ దైర్యంగా ఇంటి కప్పుపైకి ఎక్కి మరీ జనాల చెవులు చిల్లులు పడేలా ఆయనే పార్టీకి ఎసరు పెట్టారు అని తెగేసి ప్రకటించేశారు. కానీ జనాలు మాత్రం వాళ్ళ మాటలసలు నమ్మలేదు, కానీ జనాలే కాంగ్రెస్ పార్టీకి ఎసరు పెట్టేసారు. కాంగ్రెస్ పార్టీకే కాదు చెప్పులరిగిపోయేలా తిరిగినా పాపం ఆయన చెప్పుల పార్టీకి కూడా ఒక్కసీటు రాలేదు. పాపం అందరికీ శకునం చెప్పిన బల్లి కుడితిలో పడి చచ్చిందన్నట్లయింది ఆయన పరిస్థితి. రాష్ట్రానికి, తెలుగు జాతికి, కాంగ్రెస్ పార్టీకి ఎంచక్కగా జోస్యం చెప్పిన ఆయన కనబడకుండా పోయాడు. కానీ జనాలు మాత్రం ఇప్పుడు ఆయన చెప్పిన జోస్యం గుర్తు తెచ్చుకొంటూ ఆకులు పట్టుకొంటున్నారు. అయితే జనాలెవరూ కూడా ఆయనలాగే జోస్యం చెప్పి, విభజనను వ్యతిరేఖిస్తూ పోరాడి చివరికి దేశాటన కూడా చేసి వచ్చిన మరో పెద్దమనిషి జగన్మోహన్ రెడ్డి గురించి ఈవిధంగా ఎప్పుడు అనుకోకపోవడం ఏమిటో..అస్సలు అర్ధం కావడం లేదు. ఒకానొకప్పుడు సమైక్య ఛాంపియన్ రేసులో ఇద్దరూ సరి సమానంగానే పరిగెత్తారు. ఇద్దరూ కూడా ఒక్కలాగే జోస్యం చెప్పారు. కానీ జనాలు ఆయనని తలచుకొని ఈయనగారిని మరిచిపోవడం ఏ మాత్రం భావ్యం కాదు. ఏమంటే ఆయన ముందే ప్రామిస్ చేసినట్లు రాజకీయ సన్యాసం తీసుకొన్నారు కనుక ఆయనొక గొప్ప త్యాగమూర్తని...ఈయనగారు సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో జనాలకి కుచ్చు టోపీ పెట్టిన వాడని...లక్షా తొంబై కారణాలు చెప్పవచ్చు గాక, కానీ అంతమాత్రాన్న క్రెడిట్ అంతా ఆయనకే ఇచ్చేయడం ఏ మాత్రం భావ్యం కాదు. నిజానికి పెరటి మొక్క వైద్యానికి పనికి రాదనే సంగతి గ్రహించకుండా కిరణ్ కుమార్ రెడ్డి తన అధిష్టానానికి నచ్చచెప్పాలని చూడటం మొదటి తప్పు. ఒకపక్క అధిష్టానానికి వద్దు వద్దు అని చెపుతూనే చివరి నిమిషం వరకు ముఖ్యమంత్రి కుర్చీని అంటి పెట్టుకొని కూర్చొవడం మరో తప్పు. కూర్చొని మళ్ళీ అదే అధిష్టానానికి రాష్ట్ర విభజనకి ‘ఫుల్ కోపరేషన్’ ఇవ్వడం ఇంకో తప్పు. కోపరేషన్ చేస్తూనే చేయడం లేదని బుకాయించడం మరో తప్పు. సమయం కాని సమయంలో వేరు కుంపటి పెట్టుకోవడం మరో పెద్ద తప్పు. ఒక పక్క రాష్ట్రం విడిపోతుంటే సమైక్యాంధ్ర పార్టీ అని పేరు పెట్టుకోవడం ఇంకో తప్పు. ఇన్ని తప్పులు చేసి, కేవలం స్వీయ తప్పిదాల కారణంగానే కనబడకుండాపోయిన ఆయనను జనాలు తలుచుకొంటున్నారే గానీ కంటికెదురుగా తిరుగుతున్న చెట్టంత మనిషిని పట్టించుకోక పోవడం చాలా దారుణం. ఇంతకీ ఆయనగారి గొప్పదనం ఏమిటి ఈయనగారు చేసిన నేరం ఏమిటి?ఈ జనాల తీరు చూస్తే కడుపు రగిలిపోతోంది...విశ్వసనీయతే లేదు వీళ్ళకి...
http://www.teluguone.com/news/content/kirankumar-reddy-45-39863.html





