కవిత నివాసానికి కేసీఆర్ సతీమణి.. తల్లీ కూతుళ్ల మధ్య ఏం జరిగింది?
Publish Date:Sep 12, 2025
Advertisement
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌కు గురైన తర్వాత కల్వకుంట్ల కుటుంబానికి కవిత పూర్తిగా దూరమైనట్లేనంటూ వార్తలు వచ్చాయి. అంతకు ముందు కూడా కవిత తండ్రిని కలవడానికి ప్రయత్నించినా కేసీఆర్ ఆమెను దూరంగానే ఉంచారు. ఈ నేపథ్యంలో గురువారం(సెప్టెంబర్ 11) కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ అయిన తరువాత తొలి సారిగా ఆమె తల్లి, కేసీఆర్సతీమణిక ల్వకుంట్ల శోభ కవిత నివాసానికి వెళ్లారు. శోభ తన కుమార్తె కవిత నివాసానికి వెళ్లడం ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చనీయాంశమైంది. కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ పుట్టిన రోజు గురువారం (సెప్టెంబర్ 11). ఆ సందర్భాన్నిపురస్కరించుకుని శోభ కవిత నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె కవితతో ప్రత్యేకంగా మాట్లాడారు. అన్నీ సర్దుకుంటాయని ఆమె కవితకు చెప్పినట్లు సమాచారం. అదలా ఉంచితే.. అంతేనా? అంతకు మించి ఏమైనా ఉందా అన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఎందుకంటే.. కవిత సస్పెన్షన్ తరువాత ఇప్పటి వరకూ కవిత ముఖం కూడా చూడని శోభ ఇప్పుడు పని కట్టుకుని అల్లుడి పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఎందుకు వెళ్లారన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ నెల 2న బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండయ్యారు. ఆ తరువాత మూడు రోజులకు అంటే సెప్టెబర్ 5న కవిత కుమారుడి పుట్టిన రోజు. ఆ సందర్భంగా కవిత తన తల్లిని ఆహ్వానించినా ఆమె మనవడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్ల లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా అల్లుడి పుట్టిన రోజు సందర్భంగా వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ సూచన మేరకే శోభ కవిత ఇంటికి వెళ్లి ఆమెను సముదాయించి వచ్చారని అంటున్నారు. కుటుంబంలో సయోధ్య కోసం కేసీఆర్ కుమార్తె వద్దకు శోభను పంపారన్న చర్చ జరుగుతోంది. సొంత పార్టీ నేతలు, బంధువులు కూడా అయిన హరీశ్‌రావు, సంతోశ్ కుమార్‌లపై కవిత తీవ్ర అవినీతి ఆరోపణలు చేయడం, వారి వల్లే కేసీఆర్‌కు చెడ్డపేరు వస్తోందని వ్యాఖ్యానించడం పార్టీలో పెను దుమారం రేపడమే కాకుండా కవిత సస్పెన్షన్ కు కూడా ఆ ఆరోపణలే కారణమయ్యాయి. కవితపై క్రమశిక్షణ చర్య కింద సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ.. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఇప్పటి వరకూ కవిత ఆరోపణలను ఖండించలేదు. హరీష్ రావుకు మద్దతుగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. మొత్తంగా కవిత ఆరోపణలపై వ్యూహాత్మక మౌనం పాటించారు. ఈ నేపథ్యంలోనే తల్లీ కుతుళ్ల భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
http://www.teluguone.com/news/content/kcr-wife-to-kavitha-house-39-206049.html





