కేసీఆర్ పగటి కలలు!
Publish Date:Nov 5, 2013
Advertisement
పగటి కలలు కనడంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారికి పీహెచ్‌డీ ఇవ్వొచ్చు. తెలంగాణ వచ్చేసినట్టు, తెరాస అధికారంలోకి వచ్చేసినట్టు కలలు కనడమే కాకుండా, ఆ పగటి కలల్ని అమాయకులైన తెలంగాణ ప్రజలకు చెబుతూ చప్పట్లు కొట్టించుకున్నాడు. చాలాకాలం తర్వాత ఫామ్ హౌస్‌లోంచి బయటికొచ్చి మెదక్ జిల్లా సిద్దిపేటలో మీటింగ్ పెట్టిన కేసీఆర్ మరోసారి తన పగటి కలల చిట్టా విప్పాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున మొత్తం 24 జిల్లాలు ఏర్పాటు చేస్తాడట. హైదరాబాద్ నగరం చుట్టూ వంద కిలోమీటర్ల పరిధిలో శాటిలైట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తాడట. హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆరు లైన్ల జాతీయ రహదారిగా మారుస్తాడట. విద్యుత్‌తో నడిచే కాలుష్యం లేని లైట్ రైల్ రవాణా సిస్టాన్ని ఏర్పాటు చేస్తాడట. ఈ రైలు హైదరాబాద్ చుట్టూ వంద కిలోమీటర్ల పరిధిలో తిరిగే ఏర్పాటు చేస్తాడట. ఈ రైలు వల్ల సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కి కేవలం 24 నిమిషాల్లో చేరుకోవచ్చట.
తెలంగాణకి పుష్కలంగా సాగునీరు అందించే పథకాలు తన దగ్గర బోలెడన్ని ఉన్నాయట. తెలంగాణలో బలహీన వర్గాల ప్రజలందరికీ రెండు పడక గదులు, హాలు, వంటగది వున్న ఇల్లు ప్రభుత్వమే కట్టి ఇస్తుందట. రోడ్లు, మోరీలు, నల్లాలతోపాటు మరుగుదొడ్లు కూడా తెలంగాణ ప్రభుత్వమే కట్టి ఇస్తుందట. తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగం అనే పదమే ఉండదట. ఇప్పుడు ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేసేస్తారట. ఇంకా చాలా ఆలోచనలు తన బుర్రలో వున్నాయట. అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక ఆదర్శరాష్ట్రంగా ఎదిగిపోతుందట. ఈ పగటి కలల చిట్టా వినగానే సభలో వున్న తెరాస కార్యకర్తలందరూ ఉత్సాహంతో చప్పట్లు కొట్టి జై తెలంగాణ నినాదాలు చేశారు. ఈ చప్పట్లు, నినాదాలే కేసీఆర్‌ని పగటి కలలు కనేలా ప్రోత్సహిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/kcr-statements-45-27153.html





