తమిళిసై పేరెత్తడానికి ఇష్టపడని కేసీఆర్.. గవర్నర్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు..
Publish Date:Apr 27, 2022
Advertisement
కేసీఆర్ వర్సెస్ తమిళిసై. ప్రగతిభవన్ వర్సెస్ రాజ్‌భవన్. కొన్నాళ్లుగా నడుస్తోంది వివాదం. అది జగడంగానూ మారింది. ఢిల్లీలో గవర్నర్ తమిళిసై తీవ్ర విమర్శలు చేయడంతో విషయం పూర్తిగా బెడిసికొట్టింది. అంతకుముందే, వారిద్దరూ తెగే దాకా లాగారు. కేసీఆర్ టీమ్ ఎవరూ రాజ్‌భవన్‌లో అడుగుపెట్టడం లేదు. గవర్నర్ ఎక్కడికెళ్లినా ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించి సవాల్ చేశారు. ఇలా, రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. తాజా టీఆర్ఎస్ ప్లీనరీలో గవర్నర్ సిస్టమ్‌పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ విమర్శల్లో ఎక్కడా తమిళిసై పేరు ఎత్తకుండా.. పక్క రాష్ట్రాల ప్రస్తావన మాత్రమే చేసి ఆసక్తి రేపారు. అంటే, కనీసం తన నోటి నుంచి తమిళిసై పేరు కూడా పలకడానికి కేసీఆర్ ఇష్టపడటం లేదని.. అంతగా ఆయనలో ధ్వేషం పెరిగిపోయిందని అంటున్నారు. ఇంతకీ కేసీఆర్ ఏమన్నారంటే..... గవర్నర్ వ్యవస్థపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థ దుర్మార్గంగా మారిందని.. వక్రమార్గంలో నడుస్తోందన్నారు. మహారాష్ట్రలో 12 మంది ఎమ్మెల్సీల కోసం తీర్మానం చేసి పంపితే గవర్నర్ తన దగ్గరే పెట్టుకున్నారని చెప్పారు. తమిళనాడులో పంచాయితీ, బెంగాల్‌లో సైతం పంచాయితీ నడుస్తోందన్నారు కేసీఆర్. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రజల బలంతో గెలిచిన ఎన్టీఆర్ దుర్మార్గపు గవర్నర్ వ్యవస్థను గద్దె దించారన్నారు. అదే ఎన్టీఆర్‌ను ప్రజలు తిరిగి సింహాసనంపై కూర్చోబెట్టారని గుర్తు చేశారు. ఇలా.. పాత, కొత్త విషయాలన్నీ ప్రస్తావించిన కేసీఆర్.. తెలంగాణ గవర్నర్ తమిళిసై గురించి ఒక్క మాట కూడా అనలేదు. మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడుల టాపిక్ తీసుకొచ్చారుగానీ.. తన గురించి, తమిళిసై గురించి, తమ మధ్య జరుగుతున్న వివాదం గురించి నామమాత్రం కూడా ప్రస్తావించలేదు. అంటే, గవర్నర్ తమిళిసై పేరు పలకడానికి కూడా ఆయనకు ఇష్టం లేకనో.. లేదంటే, తమ గొడవల గురించి చర్చ జరగకూడదనే ఉద్దేశమో.. కారణం ఏదైనా కేసీఆర్ కామెంట్లు కలకలం రేపుతున్నాయి.
http://www.teluguone.com/news/content/kcr-comments-on-governor-system-25-135069.html





