కేసీఆర్ కొత్త ఉద్యమం హైదరాబాద్ కోసమా, ఎన్నికల కోసమా?
Publish Date:Aug 19, 2013
Advertisement
కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర ప్రకటన చేసిన నాటి నుండి తెరాస రాజకీయ నిరుద్యోగిగా మారింది. సీమంధ్రాలో సమైక్య ఉద్యమాలు ఎంత జోరుగా సాగుతున్నపటికీ, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకే మొగ్గుచూపుతుండటంతో, ఇక కేంద్రాన్ని నిలదీసేందుకు తెరాసకు అవకాశంలేకుండా పోయింది. ఒకవేళ కాంగ్రెస్స్ అధిష్టానం సీమాంధ్ర ఒత్తిళ్లకు లొంగి వేరే ఏమయినా మాట్లాడి ఉండి ఉంటే, తెరాసకు ఉద్యమించే అవకాశం ఉండేది. కానీ, కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి ఒత్తిళ్లకు లొంగ కుండా తెలంగాణా ఏర్పాటు విషయంలో ధృడ నిశ్చయంతో వ్యవహరిస్తుండటంతో, తెరాసకు పనిలేకుండా పోయింది. అదికాక, కాంగ్రెస్ పార్టీతో విలీనం కోసం పార్టీలో అంతర్గతంగా ఒత్తిళ్ళు కూడా ఉండటంతో కేసీఆర్ ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ అనే కొత్త నినాదంతో మళ్ళీ రంగంలోకి దిగారు. ఆంధ్ర ఉద్యోగులను రెచ్చగొట్టి తద్వారా ఆంధ్ర, తెలంగాణా ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టిన కేసీఆర్ ఇప్పుడు జంట నగరాలలో ప్రదర్శనలు నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారు. తద్వారా ప్రజల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ అంశంపై కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచడమే తమ ఉద్దేశ్యమని ఆయన చెపుతున్నపటికీ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో తెరాసను విలీనం చేయకాపోతే, రానున్న ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీకి అవసరమయిన తెలంగాణా సెంటిమెంటు లేకపోవడంతో, కేసీఆర్ ఇప్పుడు ఈ ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ అనే ఉద్యమం మొదలుపెట్టి మరో బలమయిన సెంటిమెంటును ఏర్పరుచుకోవాలనే ఆలోచనతోనే ఈ కొత్త పల్లవి అందుకొన్నట్లున్నారు. తెలంగాణా సెంటిమెంటుని కాంగ్రెస్ హైజాక్ చేసుకుపోయిన తరువాత, తెరాస మనుగడ సాగించాలంటే ఇటువంటి బలమయిన సెంటిమెంట్ చాల అవసరమని గ్రహించబట్టే కేసీఆర్ ఈ కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సాధారణ ఎన్నికలకి ఇంకా 7-8 నెలల సమయం మిగిలి ఉన్నందున, ఈలోగా హైదరాబాద్ అంశంపై మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టినట్లయితే అది ఎన్నికల సమయానికి తీవ్రతరమయి పార్టీకి మేలుచేస్తుందని కేసీఆర్ ఆలోచన కావచ్చును. హైదరాబాద్ పై సమాన హక్కుల కోసం పట్టుబడుతున్న సీమాంధ్ర నేతలు ఎటూ హైదరాబాద్ విషయంలో తగ్గరని కేసీఆర్ కు తెలుసు గనుక, ఈ అంశంతో తెలంగాణా ప్రజల భావోద్వేగాలను మళ్ళీ రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందవచ్చునని కేసీఆర్ ఆలోచన. కానీ, తెరాసను పూర్తిగా తుడిచిపెట్టేసి, రానున్న ఎన్నికలలో తెలంగాణాలో ఏకపక్షంగా గెలవాలనే ఆలోచనతోనే ఎంతో సాహసోపేతమయిన నిర్ణయం తీసుకొన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెరాస ఈవిధంగా పుంజుకోవడాన్ని చూస్తూ ఊరుకొంటుందని భావించలేము. కేసీఆర్ గనుక మళ్ళీ ఉద్యమ బాటపట్టి బలపడితే, కాంగ్రెస్ పార్టీ ఎంతో దైర్యంచేసి చేసిన తెలంగాణా ప్రకటన ఫలితమూ దక్కదు. గనుక, కాంగ్రెస్ పార్టీ తెరాస విలీనం కోసం ఆ పార్టీపై ఒత్తిడి పెంచుతూనే, ఒకవేళ కేసీఆర్ ఉద్యమం మొదలుపెడితే వెంటనే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి పరిస్థితిని తిరిగి తన అదుపులోకి తెచ్చుకొనే ప్రయత్నం చేయవచ్చును.
http://www.teluguone.com/news/content/kcr-37-25199.html





