కాంగ్రెస్ వైకాపాల సమైఖ్య చదరంగంలో తెదేపా బలి
Publish Date:Aug 16, 2013
Advertisement
రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తెదేపా, ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో రగులుతున్న ఉద్యమ జ్వాలల నుండి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడటంతో తప్పని పరిస్థితులో ఆ పార్టీ నేతలు కూడా సమైక్యబాట పట్టవలసి వచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రం తొలుత తమ లేఖకే కట్టుబడి ఉన్నానని ప్రకటించినప్పటికీ, వైకాపా నేతలు ఈ సమైక్య రేసులో ముందుకు దూసుకుపోతుండటంతో, ఇక తమనేతలను కూడా చురుకుగా సమైక్య ఉద్యమాలలో పాల్గొనాలని, ప్రజల అభీష్టం మేరకు ముందుకు సాగవలసిందిగా ఆయన తన నేతలకు స్పష్టమయిన ఆదేశాలిచ్చారు. ఇది ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలకు సమరోత్సాహం కలిగించవచ్చును, కానీ, తెలంగాణా నేతలకు మాత్రం పార్టీ అధ్యక్షుడిపై నమ్మకం కోల్పోయేలా చేయడం ఖాయం. వారికి సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్నఉద్యమాల గురించి, అక్కడ తమ పార్టీని రక్షించుకోవలసిన అవసరం గురించి తెలియకపోదు. కానీ, అదే సమయంలో వారు తమ రాజకీయ భవిష్యత్ గురించి, తెలంగాణాలో పార్టీ పరిస్థితి గురించి కూడా ఆందోళన చెందడం సహజం. సీమాంధ్రలో కాంగ్రెస్, వైకాపాల నుండి తమ పార్టీని రక్షించుకోవడానికి చంద్రబాబు నాయుడు తీసుకొన్నఈ నిర్ణయంవల్ల తెదేపా కూడా తెలంగాణా వ్యతిరేఖమనే భావన వ్యాపిస్తే తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే వారెవరూ ఇంతవరకు పార్టీకి వ్యతిరేఖంగా మాట్లాడకపోయినప్పటికీ, మరెంతో కాలం మౌనంగా ఉండకపోవచ్చును. అదే జరిగితే తెదేపా కూడా తన తెలంగాణా నేతలని ఒకరొకరిగా సీమాంధ్ర ఉద్యమానికి బలిచేసుకొనే ప్రమాదం ఉంది. అప్పుడు ఆ పార్టీ కూడా వైకాపాలాగే తెలంగాణాలో తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్, వైకాపాలు కొనసాగిస్తున్నసమైక్య రేసులో వెనుకబడిపోకూడదని చంద్రబాబు నాయుడు తన నేతలకి చెప్పడం గమనిస్తే, ఇప్పటికే వారు వెనుకబడిపోయారని ఆయన భావిస్తున్నట్లు అర్ధం అవుతుంది. సీమాంధ్ర ప్రాంతంలో తేదేపాకు నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆయన సరిగ్గానే అంచనా వేసినట్లు కనబడుతోంది. తెలంగాణాను వదులుకొన్న వైకాపా, తన ఉద్యమాలతో సీమంధ్రలో ఇప్పటికే తన రేటింగ్ బాగా పెంచుకొంది. ఇక తెలంగాణా ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో తిరుగులేని ఆధిక్యత పొందుతూనే, సీమంద్రాలో ఆపార్టీ నేతలు చేస్తున్నహడావుడి వలన సీమాంధ్ర ప్రాంతంలో కూడాప్రయోజనం పొందే అవకాశముంది. ఈవిధంగా కాంగ్రెస్, వైకాపాలు తమ తెలంగాణా, సమైక్య ఉద్యమాలతో పూర్తి ప్రయోజనం పొందబోతుంటే, తెదేపా మాత్రం తెలంగాణకు అనుకూలమని చెప్పిఇప్పుడు తద్విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల అటు తెలంగాణాలో, అదే కారణంతో సీమాంధ్ర ప్రాంతంలో తెదేపా నష్టపోయే అవకాశం ఉంది. రాష్ట్రవిభజనకు అనుకూలంగా తెదేపా లేఖ ఇవ్వడం వలనే నేడు ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్, వైకాపాలు సీమాంధ్ర ప్రాంతంలోబాగానే ప్రచారం చేయగలిగాయి. ఆ వ్యతిరేఖ ప్రచారం నుండి బయటపడే ప్రయత్నంలో సమైక్య ఉద్యమంలోచురుకుగా పాల్గొనాలని చంద్రబాబు స్వయంగా తన నేతలకి చెప్పడం వలన ఇప్పుడు తెదేపా తెలంగాణకు వ్యతిరేఖమని కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ప్రచారం చేసుకొని లబ్దిపొందే ప్రయత్నం చేస్తుంది. తెదేపా సమైక్యఉద్యమాలలో పాల్గొన్నపటికీ తెలంగాణకు అనుకూలమని ఇచ్చిన లేఖ కారణంగా సీమాంధ్ర ప్రజల నమ్మకం పొందలేకపోవడం, సమైక్య ఉద్యమాలలో పాల్గొనడం వలననే తెలంగాణా ప్రజల నమ్మకం కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. బహుశ కాంగ్రెస్, వైకాపాలు ఈ పరిణామాలు ఆశించే ఆడిన ఈ సమైక్య చదరంగంలో తెదేపా నష్టపోయేది తెదేపాయేనని చూచాయగా అర్ధం అవుతోంది.
http://www.teluguone.com/news/content/congress-37-25179.html





