కమలా? మిఛెల్లీనా?
Publish Date:Jul 22, 2024
Advertisement
అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరిగే నేపథ్యంలో ఒకవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో వున్నారు. ట్రంప్ అసలే కోతి.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా ఇటీవలే ఆయన చెవిని బుల్లెట్ ముద్దుపెట్టుకుంది. దాంతో ఈసారి విజయం తనదేనని ఆయన ధీమాగా వున్నాడు. ట్రంప్ దూకుడుని బైడన్ తట్టుకోలేడని భావిస్తూ డెమెక్రటిక్ పార్టీ నాయకులు ఎప్పటి నుంచో బైడన్‌ని తప్పుకోవయ్యా మహాప్రభో అని చెవి దగ్గర జోరీగల్లా మోగుతున్నారు. వారిలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా వున్నారు. అలా అందరూ మొత్తుకోవడం వల్ల అయితేనేమి, తనకు ఈసారి అంత దృశ్యం లేదని తానే అర్థం చేసుకోవడం వల్ల అయితేనేమి బైడన్ అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. ఆయన తప్పుకుంటూ తప్పుకుంటూ.... అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఉపాధ్యక్షురాలు, భారత మూలాలున్న కమలా హ్యారీస్‌ని రికమండ్ చేశారు. ఆయన రికమండ్ చేసినంత మాత్రాన అంత ఈజీగా కమలా హ్యారీస్ అభ్యర్థిత్వం ఖరారు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కమలా హ్యారిస్‌ని బైడన్ ఇలా రికమండ్ చేశాడో లేదో అలా ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. బైడెన్ కంటే కమలాని ఓడించడమే ఈజీ అని ప్రకటించేశాడు. అదేవిధంగా, నిన్నటి వరకూ బైడెన్ అభ్యర్థిత్వాన్ని బరాక్ ఒబామా వ్యతిరేకిస్తూ వస్తున్నది, ఆయన్ని తప్పుకోవాలంటూ సూచిస్తున్నది పార్టీ క్షేమం కోసం అని అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ, ఆయన ఆలోచిస్తున్నది తన భార్య మిఛెల్లీ ఒబామా క్షేమం కోసం అనే విషయం లేటెస్టుగా అర్థమైంది. అధ్యక్ష అభ్యర్థి విషయంలో పార్టీ నుంచి అనూహ్యమైన నిర్ణయం వెలువడబోతోంది అని ఆయన ప్రకటించారు. అంటే, బైడెన్ రికమండ్ చేసిన కమలా హ్యరిస్‌కి గట్టి పోటీనే ఉందన్నమాట. ఒబామా కూడా తక్కువ వాడేమీ కాదు కదా.. తన భార్య అభ్యర్థిత్వాన్ని ఓకే చేయించుకునేందుకు పార్టీ కీలక నాయకులతో మంతనాలు జరుపుతున్నాడు. కమలా హ్యారిస్ కూడా ప్రస్తుత ఉపాధ్యక్షురాలి హోదాలో తన లాబీయింగ్ తాను చేస్తున్నారు. అసలు పోటీకి ముందు ఈ కొసరు పోటీలో కమలా గెలుస్తారా? మిఛెల్లీ గెలుస్తారా అనేది వేచి చూడాలి.
http://www.teluguone.com/news/content/kamala-harris-michelle-obama-25-181221.html





