రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు శ్రీకారం.. పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు..!
Publish Date:Jul 3, 2026
Advertisement
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్‌తో కలిసి కాంక్రీట్ వేసి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు రాయలసీమ స్టీల్ ప్లాంట్ కోసం దశాబ్దకాలంగా ఎదురుచూశామని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ హామీ నెరవేరుతోందన్నారు. రాయలసీమ ఇప్పుడు హార్టికల్చర్, అరుదైన ఖనిజాలు, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీకి కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు. కియా కార్లు, హీరో బైక్స్, డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సీమ ముందంజలో నిలుస్తోందన్నారు. విభజన తర్వాత ఎదురైన అవాంతరాలు, అడ్డంకులు, అవమానాలను అధిగమించి ప్లాంట్ పనులు ప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వాలు పలుమార్లు శంకుస్థాపనలు చేసినా, ఒక్క ఇటుక కూడా పేర్చలేదని విమర్శించారు. గత రెండేళ్లలో అనుమతులు, ఇతర అంశాలను పరిష్కరించి పనులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. 1,100 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కానుందని చెప్పారు.మొదటి దశలో రూ.4,500 కోట్లకు పైగా, రెండో దశలో రూ.11,850 కోట్ల పెట్టుబడులు వస్తాయని వివరించారు. విశాఖతో పాటు రాయలసీమ కూడా ఉక్కు ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. జేఎస్‌డబ్ల్యూ సంస్థ స్టీల్ ప్లాంట్‌తో పాటు సోలార్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేస్తోందన్నారు. పూర్తిగా గ్రీన్ ఎనర్జీ ఆధారంగా వ్యర్థాల నుంచి సేకరించిన ఇనుముతో ఉక్కు ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. విశాఖ ఉక్కు సంక్షోభ సమయంలో కేంద్రంతో చర్చించి రూ.11,440 కోట్ల ఆర్థిక సాయం తెచ్చి సంస్థను కాపాడామని గుర్తు చేశారు. నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ సంస్థ రూ.1.35 లక్షల కోట్లతో మరో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందన్నారు. జేఎస్‌డబ్ల్యూ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిందన్నారు. బళ్లారి ప్లాంట్ కంటే అధిక సామర్థ్యంతో రాయలసీమ ప్లాంట్‌ను అభివృద్ధి చేయాలని జేఎస్‌డబ్ల్యూను కోరారు. గండికోట నుంచి 15 కిలోమీటర్ల పైప్‌లైన్ ద్వారా 2 టీఎంసీల నీటిని ప్లాంట్‌కు అందిస్తామని తెలిపారు. రాయలసీమలో లభించే నాణ్యమైన ముడి ఇనుము ఖనిజాన్ని కూడా పరిశ్రమకు అందించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీని ప్లాంట్‌కు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జేఎస్‌డబ్ల్యూ ప్లాంట్‌తో ఈ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. గతంలో కియా ప్లాంట్ తీసుకువచ్చిన తర్వాత అనంతపురం రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. బ్రహ్మణీ స్టీల్స్ పేరుతో గతంలో వేల ఎకరాల భూములు కేటాయించి ప్రజల్లో భ్రమలు కల్పించారని సీఎం చంద్రబాబు విమర్శించారు.
ఇకపై రాయలసీమ కరువు నేల కాదని, జలకళ ఉట్టిపడే పచ్చని ప్రాంతంగా మారుతుందని చెప్పారు.
పరిశ్రమల విస్తరణతో పాటు రాయలసీమ స్టీల్ ప్లాంట్ ద్వారా ఈ ప్రాంతంలో కొత్త యుగానికి నాంది పలుకుతున్నామని చంద్రబాబు అన్నారు.
http://www.teluguone.com/news/content/jsw-rayalaseema-steel-limited-36-224951.html





