‘గోవింద’ నామంతో విద్యారంభం.. టీటీడీ ‘అక్షర గోవిందం’ ప్రారంభం..!
Publish Date:Jul 3, 2026
Advertisement
శ్రీ వకుళామాత సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ‘అక్షర గోవిందం – అన్నప్రాశనం’.. చిన్నారుల విద్యారంభం, జీవితారంభం శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో మంగళప్రదంగా సాగాలనే సంకల్పంతో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వకుళామాత ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన ‘అక్షర గోవిందం – అన్నప్రాశనం’ కార్యక్రమాన్ని శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర పాల్గొని చిన్నారులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ, అక్షరాభ్యాసం, అన్నప్రాశనం ప్రతి చిన్నారి జీవితంలోని అత్యంత పవిత్రమైన సంస్కారాలని పేర్కొన్నారు. తొలి అక్షరం ‘గోవింద’ నామంతో ప్రారంభమైతే విద్యాభ్యాసం దైవానుగ్రహంతో విజయవంతంగా సాగుతుందనే విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించిందన్నారు. ప్రతి హిందూ కుటుంబం ఈ దివ్య అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ‘అక్షర గోవిందం కిట్’ ఉచిత పంపిణీ.. ప్రత్యేక పూజల అనంతరం చిన్నారులకు ‘అక్షర గోవిందం కిట్’ను ఉచితంగా అందజేశారు. ఇందులో రాతపలక, బలపాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, శ్రీవారి కంకణం, ఫటిక బెల్లం, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ వకుళామాత, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి చిత్రపటాలు, గోవింద నామాలు, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, పెద్దబాలశిక్షతో పాటు పూజా, విద్యా సామగ్రిని ఏర్పాటు చేశారు. రూ.2 కోట్ల వ్యయంతో యాత్రికుల వసతి సముదాయం ప్రారంభం.. అనంతరం రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన యాత్రికుల వసతి సముదాయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భాను ప్రకాష్ రెడ్డి, దర్శన్, ఎన్. సదాశివరావు, డాలర్ దివాకర్ రెడ్డి, హెచ్డీపీపీ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్, అదనపు కార్యదర్శి కల్యాణి, ఎస్ఈలు వేంకటేశ్వర్లు, మనోహరం, ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, డిప్యూటీ ఈవోలు శివప్రసాద్, ఆనంద రాజు, వీజీవో గిరిధర్, ఏఈఓ గోపీనాథ్, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు, భక్తులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/akshara-govindam-36-224992.html





