గ్రేటర్ పై జనసేన అశలు! పవన్ పాచిక పారేనా?
Publish Date:Oct 25, 2020
Advertisement
జీహెచ్ఎంసీ ఎన్నికలను జనసేన సీరియస్ తీసుకుందా? బీజేపీతో కలిసి బల్దియాలో పాగా వేసేలా ప్లాన్ చేస్తోందా? అంటే జనసేన పవన్ కళ్యాణ్ తాజా అడుగులు చూస్తే అవుననే అనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్ గానే పవన్ కళ్యాణ్ తాజా ప్రకటనలు ఉన్నాయని చెబుతున్నారు. హైదరాబాద్ వరదలు, చెరువుల సంరక్షణ, ఎంతో కాలంగా వివాదంగా ఉన్న 111 జీవోలపై పవన్ చేసిన కామెంట్లు ఇందుకు బలాన్నిస్తున్నాయి. బల్దియా ఎన్నికల్లో సత్తా చాటాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని, అందుకే ఆయన హైదరాబాద్ సమస్యలపై స్పందించారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. హైదరాబాద్ సమస్యలు ప్రస్తావిస్తూ.. ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపుతూనే ప్రస్తుత సర్కార్ కు బాధ్యతలు గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం పార్టీలు ఏం చేయాలో కూడా వివరించారు. నగరాన్ని కాపాడుకునేందుకు ప్రజలుగా గ్రేటర్ వాసులు చేయాల్సిన పనులు కూడా తెలిపారు పవన్ కళ్యాణ్. అన్ని పార్టీలు వ్యవస్థలను బలోపేతం చేసేలా వ్యవహరించాలని, వ్యవస్థకు తూట్లు పొడిచి వెళ్లిపోతే వచ్చే సమస్యలు చాలా భయకరంగా ఉంటాయని హెచ్చరించారు జనసేనాని. నిజానికి హైదరాబాద్ సమస్యలపై ఇటీవల ఎవరూ మాట్లాడనంత క్లారిటీగా పవన్ మాట్లాడరనే చర్చ సిటీ ప్రజల్లో జరుగుతుందని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి జనసేన కసరత్తు కూడా ప్రారంభించిందని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లకు కమిటీలను నియమిస్తున్నారు. ఇప్పటికే మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని పలు డివిజన్లకు కమిటీలను ఖరారు చేశారు. ఈ కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని మొదలు పెట్టాయని, ఇటీవల వచ్చిన వరద సహాయక పనుల్లో చురుకుగా పాల్గొన్నాయని చెబుతున్నారు. మిగిలిన డివిజన్ల కమిటీలను త్వరలోనే ప్రకటించనున్నారని తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో తమకు 40 డివిజన్లలో పట్టుందని, పవన్ కళ్యాణ్ గ్లామర్ తో మరిన్ని సీట్లలోనూ పుంజుకుంటామని హైద్రాబాద్ జనసేన నేతలు ధీమాగా చెబుతున్నారట. గ్రేటర్ పరిధిలో జనసేనకు సుమారు 8 లక్షల సభ్యత్వం ఉందని సమాచారం. ప్రతి నియోజకవర్గంలో సుమారు పది వేల మంది జనసేన సభ్యులు ఉన్నారట. 20వేలకు పైగా సభ్యత్వమున్న నియోకవర్గాలు సైతం ఉన్నాయని జనసేన గ్రేటర్ నాయకులు చెబుతున్నారు. ఆంధ్రా సెటిలర్లు అధికంగా నివాసముండే మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో జనసేనకు ఎక్కువ బలమున్నట్లు తెలుస్తోంది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ నియోజకవర్గాలతోపాటు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సనత్‌నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో జనసేనకు కార్యకర్తల బలముంది. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో జనసేనకు సుమారు 28వేల ఓట్లు వచ్చాయి. అధికార టీఆర్ఎస్ ఓట్లను జనసేన చీల్చినందుకే.. రేవంత్‌రెడ్డి 6వేల ఓట్ల మెజారిటీతో మల్కాజిగిరి ఎంపీగా గెలుపొందారని జనసేన వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బండి సంజయ్.. జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కలిశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో కూడా జనసేనతో కలసి పనిచేస్తామని గతంలో చెప్పారు. ప్రతి ఏడాది కిషన్ రెడ్డి నిర్వహించే భారతమాతకు మహా హారతి కార్యక్రమానికి సైతం పవన్ కల్యాణ్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఇవన్నీ బీజేపీ-జనసేన కలిసి గ్రేటర్‌లో పోటీ చేయటానికి ఉపకరిస్తాయని ఆ పార్టీ క్యాడర్ ఆశిస్తోంది. ఖచ్చితంగా ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గ్లామర్ ప్రభావం ఉంటుందో.. ఆ లెక్క ప్రకారమే సీట్ల సర్దుబాటు కూడా చేసుకోవాలని జనసేన నేతలు నిర్ణయించారట. గ్రేటర్ లో పవన్ కల్యాణ్ కూడా ప్రచారం చేస్తారని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన సొంతంగా పోటీచేస్తే పెద్దగా ప్రభావం చూపించలేకపోవచ్చు. కాని బిజెపితో కలసి పోటీ చేస్తే ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ తో పాటు పట్టణ ప్రాంతాల్లో బిజెపికి ఉండే బలం ఆ కూటమికి కలిసి వస్తుందని చెబుతున్నారు. మొత్తంమీద గ్రేటర్ పోరులో సుమారు 40 డివిజన్లలో ఆంధ్రా సెటిలర్లు కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పోటీచేస్తే.. ఆ ప్రభావం ఎవరిపై పడుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతోంది.
http://www.teluguone.com/news/content/janasena-hopes-on-ghmc-elections-39-105554.html





