సొంత ఇంటి పంచాయతీ పరిష్కరించలేక చేతులెత్తేశారు.. కేసీఆర్ పై రఘునందన్ విమర్శలు
Publish Date:Jan 2, 2026
Advertisement
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున ఆయనపై బీజేపీ ఎంపీ రఘునందనరావు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తీరు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్న చందంలా ఉందన్నట్లుగా ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఇతరుల పంచాయతీలను పరిష్కరించడంలో గొప్ప ఉత్సాహం చూపిస్తారనీ, అయితే సొంత ఇంటి పంచాయతీల పరిష్కాం విషయంలో మాత్రం చేతులెత్తేశారనీ అన్నారు. గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కల్వకుంట్ల కవిత సొంత దారి చూసుకున్నారనీ, నేడో, రేపో ఆమె కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమనీ జోస్యం చెప్పారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహన అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డిలు లేచి నిలబడకపోవడం వారి విచక్షణకు సంబంధించిన విషయమన్న రఘునందనరావు.. కేటీఆర్ కు ముఖ్యమంత్రి కావాలన్న యాంబిషన్ ఉందనీ, అయితే అది సాకారం అవ్వాలంటే ఉండాల్సిన మద్దతు కేటీఆర్ కు సొంత పార్టీ నుంచే కరవైందన్నారు. పార్టీ దాకా ఎందుకు ఆయనకు సొంత కుటుంబంలోనే మద్దతు లేదని చెప్పారు. ఈ పరిణామాలన్నిటినీ నిశబ్దంగా గమనిస్తున్న హరీష్ రావు సమయం కోసం వేచి చూస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న రఘునందనరావు.. కావాలంటే ఈ విషయాన్ని తాను రాతపూర్వకంగా కూడా చెబుతానన్నారు. ఇక రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలపై స్పందిస్తూ.. ఏ పార్టీలోనైనా అభిప్రాయబేధాలు సహజమని కొట్టి పారేశారు. దశాబ్ద కాలం బీఆర్ఎస్ పాలనను.. రెండేళ్ల కాంగ్రెస్ పాలననూ చూసిన తెలంగాణం ఇప్పడు బీజేపీకి పట్టం గట్టాలని ఉవ్విళ్లూరుతున్నారన్నారు.
http://www.teluguone.com/news/content/bjp-mp-raghunandana-rao-criticize-kcr-39-211874.html





