గవర్నర్ వచ్చారు.. జగన్ వెళ్తున్నారు.. ఢిల్లీలో ఏం జరుగుతోంది?
Publish Date:Apr 28, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు హస్తిన పర్యటనకు బయలు దేరుతున్నారు. రెండు రోజులు హస్తినలోనే మకాం వేస్తారు. ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవుతారు. ఇంత వరకూ బానే ఉంది.. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హరిచందర్ బిశ్వభూషన్ హస్తిన పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే జగన్ హస్తిన పర్యటనకు బయలు దేరడం ప్రాధాన్యత సంతరించుకుంద. అది కూడా గవర్నర్ తో గురువారం భేటీ అయ్యి, ఆ వెంటనే శుక్రమారం ఢిల్లీ విమానం ఎక్కనుండటంతో ఏం జరగనున్నది అన్న ఉత్కంఠ నెలకొంది. ఏపీ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషన్ మూడు రోజుల హస్తిన పర్యటన ముగించుకుని ఈ రోజే తిరిగి వచ్చారు. కేంద్రం ఆయనను హస్తినకు పిలిపించుకుందని సమాచారం. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సహా పలువురు కీలక మంత్రులు, అధికారులతో వరుస బేటీలతో బిజీబిజీగా గడిపారు. ఆయన హస్తిన నుంచి తిరిగి వచ్చిన వెంటనే జగన్ ఆయనతో బేటీ అయ్యారు. గవర్నర్ తన హస్తిన పర్యటనలో భాగంగా కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నివేదికలు సమర్పించినట్లు సమాచారం. ఏపీ ఆర్థిక అవకతవకలపై కేంద్రం సీరియస్ గా ఉందనీ, స్వయంగా గవర్నర్ పూచీకత్తుపైనే ఏపీ పాతిక వేల కోట్లు అప్పు చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ హస్తిన పర్యటన, ఆ వెంటనే జగన్ ఢిల్లీ పయనం రాజకీయ వర్గాలలో పలు రకాల చర్చలకు తెర లేపాయి. గవర్నర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి కేంద్రం పెద్దలతో వరుస భేటీలతో బిజీబిజీగా గడపడంతో ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రం చర్యలకు ఉపక్రమించేందుకు దాదాపుగా సిద్ధమైందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అందుకే జగన్ ను హుటాహుటిన హస్తినకు పిలిపించారన్న అనుమానాలూ వ్యక్త మౌతున్నాయి.
దీంతో గవర్నర్ కేంద్రానికి ఇచ్చిన నివేదికలు ఏమిటి? ఆ నివేదికల ఆధారంగా కేంద్రం ఏం చర్యలు తీసుకోనున్నది? ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ఏం చర్యలకు ఉపక్రమించనున్నది అన్నది ఉత్కంఠగా మారింది.
ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ హడావుడిగా గవర్నర్ తో భేటీ కావడం, ఆ వెంటనే హస్తిన బయలుదేరడానికి షెడ్యూల్ ఖరారు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ ఆర్థిక అవకతవకలపై కేంద్రం సీరియస్ గా ధృష్టి పెట్టిందన్న పరిశీలకుల విశ్లేషణలకు ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి.
http://www.teluguone.com/news/content/jagan-to-ddelhi-after-governer-return-what-is-happening-in-delhi-39-135122.html





