దసరా గిఫ్ట్ గా ఎమ్మెల్యేలకు జగన్ సీల్డ్ కవర్లు.. విషయమేమిటంటే..?
Publish Date:Oct 18, 2023
Advertisement
ఏపీలో అధికార పార్టీలో ఇప్పుడు జగన్ దసరా గిఫ్టుల సంచలనం రేపుతున్నాయి. ఔను ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలు కొందరికి దసరా గిఫ్టులు పంపించారన్న ప్రజారం జోరుగా సాగుతోంది. అయితే అవేం ఆషామాషీ గిఫ్లులు కాదని పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జగన్ కొందరు ఎమ్మెల్యేలకు పింపించిన ఈ దసరా గిఫ్టులు వారి వారి నియోజకవర్గాలలో వారి పనితీరు, వారి విజయావకాశాలు తదితర అంశాలకు సంబంధించిన జగన్ సొంతంగా చేయించిన సర్వే రిపోర్టుల సీల్డ్ కవర్ లు అంటున్నారు . అయితే ఈ సీల్డ్ కవర్ లు ఏయే ఎమ్మెల్యేలకు పంపించారన్న సమాచారం లేకపోయినా.. చాలా మంది సిట్టింగులకు ఇవి అందాయని అంటున్నారు. దీంతో ఈ సీల్డ్ కవర్లు ఎవరెవరికి అందాయి, అందులో వివరాలేంటి అన్న వివరాలు తెలియక మొత్తం ఎమ్మెల్యేలంతా తెగ టెన్షన్ పడిపోతున్నారని పార్టీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అక్టోబర్ నెలలో అందిన తాజా సర్వే ఫలితాలను సీల్డ్ కవర్ లో అందుకున్న ఎమ్మెల్యేలు ఎవరన్న వివరాలు కూడా గోప్యంగానే ఉన్నాయి. దీంతో ఆ రిపోర్టులలో ఏముంది?.. ఈసారి పార్టీ టికెట్ గ్యారంటీ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ, అలాగే టికెట్ దక్కకుండా పోయే వారు ఎవరు? ఒక వేళ టికెట్ ఇచ్చినా.. తమ సిట్టింగ్ స్థానాలలోనే ఇస్తారా.. లేక నియోజకవర్గం షిఫ్ట్ చేస్తారా? అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి అవకాశం ఉంటుందా? లేదా ఎమ్మెల్యేగా మీ సేవలు చాలు..ఇక లోక్ సభకు పోటీ చేయండి అంటారా? అసలు ఎవరెవరికి ఈ రిపోర్టులను దసరా గిఫ్టుగా జగన్ పంపించారు అన్న ఉత్కంఠ వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తమౌతోందంటున్నారు. ఏపీలో మరో ఐదారు నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఆరు నెలల లోపు అంటే ఇక సమయం లేదు మిత్రమా రణమే అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే జగన్ ఇప్పటికే పార్టీ అభ్యర్థుల ఎంపిక ఆరంభించేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కోఆర్డినేటర్ల ద్వారా సమావేశాలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసే పని ఆరంభమైపోయిందంటున్నారు. అలాగే నియోజకవర్గాల వారీగా అసంతృప్తులను బుజ్జగిస్తూ కలిసి పనిచేసేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే, పలు నియోజకవర్గాలలో అసంతృప్తులు రెబల్స్ గా మారుతుండడం పార్టీ పెద్దలకు సైతం తలనొప్పిగా మారుతుంది. మరోవైపు వైసీపీ సొంత సర్వే ఫలితాలు జగన్ చేతికి చేరడంతో..ఆ సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపికకు చేస్తున్న కసరత్తులో భాగంగానే జగన్ కొందరు ఎమ్మెల్యేలకు వారి వారి నియోజకవర్గాలలో సర్వే ఫలితానికి సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్ లో పంపారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు సర్వేల ఫలితాల ఆధారంగా పంపిన సీల్డ్ కవర్ లో ఆయా నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి, సదరు నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు, గెలుపు అవకాశాల వివరాలతో పాటు 25 అంశాలతో కూడిన లేఖలను సీఎం పంపించారని చెబుతున్నాయి. అయితే ఇప్పటికింకా ఆ లేఖలు ఎవరికీ చేరలేదనీ, ఒకటి రెండు రోజులలో అవి అందుతాయనీ పార్టీ వర్గాల సమాచారం. దీంతో తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందోనని ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా తీసిన సర్వేల ఫలితాలు ఈ లేఖలో ఉండనుండగా.. పనితీరు బాగోలేని వారి పట్ల జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. ప్రజా మద్దతు లేని ఎమ్మెల్యేలకు ఈసారి సీటు ఇవ్వడంలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈసారి సీటు ఉంటుందా ఉండదా అన్నది లేఖ వస్తే కాని అర్ధమయ్యే పరిస్థితి లేకపోవడంతో సిట్టింగుల్లో కలవరం మొదలైంది. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలు మెరుగ్గా పనిచేయాలని, లేకపోతే కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తామని గతంలోనేజగన్ సంకేతాలు పంపారు. గతంలో తాడేపల్లిలో వర్క్ షాప్ నిర్వహించిన సందర్భం ఆ ఎమ్మెల్యేలకే ఇప్పుడు మళ్ళీ లేఖలు పంపి ఉంటారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఇప్పటికే రెండు విడతలుగా వైసీపీ సొంత సర్వేల ఫలితాలు వెలువడగా.. తాజాగా మూడవ విడత ఫలితాలు కూడా అందాయి. గతంలో అందిన రెండు ఫలితాల ఆధారంగా జగన్ సమీక్షా సమావేశాలు నిర్వహించి పనితీరు మెరుగుపర్చుకోవాలని హెచ్చరించగా.. ఇప్పుడు ఈ ఫైనల్ సర్వే ఫలితాల తర్వాత మాత్రం ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. డైరెక్ట్ గా ఎమ్మెల్యేలకు లేఖలు పంపిన జగన్ అందులోనే పూర్తి వివరాలను పొందుపరిచారంటున్నారు. దాదాపుగా 25 నుండి 30 మందికి ఈసారి టికెట్లు కష్టమేనని.. ఇప్పటికే కొత్త అభ్యర్థుల కోసం అన్వేషణ కూడా మొదలైనట్లు చెప్తున్నారు. దీంతో వైసీపీలో ఇప్పుడు ఈ లేఖల కలకలం రేగుతుంది. కాగా, ఎమ్మెల్యేల పనితీరుపై లేఖలు సరే.. అసలు వైసీపీ తాజా ఫైనల్ సర్వేలో రాష్ట్రంలో ఎలాంటి ఫలితాలు అందాయన్నది రాజకీయ వర్గాలకు ఆసక్తిగా మారింది. కాగా పరిశీలకులు మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ సిట్టింగులకు టికెట్ నిరాకరించి కొత్త అసంతృప్తిని ఆహ్వానించే పరిస్థితిలో లేరనీ, పని తీరు, ప్రజా మద్దతుతో పని లేకుండానే సిట్టింగులను బుజ్జగించి పనితీరు మెరుగుపరుచుకోమని బతిమలాడుకోవడమే ఆ లేఖల సారాంశం అయి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ప్రజా వ్యతిరేక సెగ తగిలిన ఎమ్మెల్యేలూ, నేతలలో గెలుపు ఆశలు అడుగంటి పోయాయని, అందుకే పార్టీ పెద్దల హెచ్చరికలు, బెదరింపులను ఖాతరు చేసే పరిస్థితి ఉండదనీ అంటున్నారు. తాను ఎవరినీ వదులుకోననీ, అందరూ తనవారేనని గతంలో జగన్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మొత్తంగా వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జగన్ సీల్డ్ కవర్ నివేదికల్లో ఉన్న విషయాన్ని బట్టి ప్రజ్వరిల్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-sealed-covers-to-ycp-mlas-39-163628.html





