కేసుల భయంతో వణికిపోతూ చేసే రాజకీయం ఇలాగే ఉంటుంది మరి!
Publish Date:Aug 22, 2025
Advertisement
ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఒక వేళ మద్దతు ప్రకటించకపోయి ఉంటే అందరూ ఆశ్చర్యపోయి ఉండే వారు. అయితే ఎవరినీ ఆశ్చర్యపరచడం ఇష్టం ఉండని జగన్ తమ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ద్వారా ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కే వైసీపీ మద్దతు అని ఒక ప్రకటన చేయించారు. అక్కడితో ఆగకుండా బీజేపీ అగ్రనేతలు స్వయంగా కోరడం వల్లనే పార్టీలో చర్చించి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పుకుంటున్నారు. ఔను కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ స్వయంగా జగన్ కు ఫోన్ చేసి మద్దతు కోరారని ప్రచారం చేసుకుంటున్నది వైసీపీ. సరే ఇవన్నీ పక్కన పెట్టి సపోజ్.. ఫర్ సపోజ్ రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి ఉండకపోతే ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా ఇండియా కూటమికి వైసీపీ మద్దతు పలికి ఉండేదా? అంటే అబ్బే అటువంటి పరిస్థితి లేదన్న సమాధానమే ఆ పార్టీ నాయకత్వం నుంచి వ స్తుం ది. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి తరఫున సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఆయన తెలుగువారు కూడా. అయినా కూడా వైసీపీ ఎన్డీయే కూటమి అభ్యర్థికే మద్దతు ప్రకటించింది. ఎన్డీయే కూటమిలో వైసీపీకి ప్రత్యర్థి అయిన తెలుగుదేశం భాగస్వామిగా ఉంది. అయినా సరే వైసీపీ హడావుడిగా నిర్ణయం తీసేసుకుని ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించేసింది. తద్వా రా జగన్ తాను అప్పుడూ, ఇప్పడూ, ఎప్పుడూ మోడీ, షా కు విధేయుడేనని చెప్పకనే చెప్పేసింది. అలా చెప్పకుంటే.. అలా విధేయత ప్రకటించకుండా ఉంటే కేసులతో ఇబ్బంది తప్పదన్న సంగతి జగన్ కు బాగా తెలుసు. ఎప్పుడైనా మాట మాత్రంగానైనా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వ విధానాలపై విమర్శల చురకలేసినా, లేశ మాత్రంగానైనా వ్యతిరేకత ప్రకటించినా.. గత పదేళ్లకు పైగా హాయిగా బెయిలుపై తిరుగుతున్న తనకు జైలే గతి అవుతుందన్న భయం జగన్ కు నిలువెల్లా ఉందంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తన హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో జగన్ ఇప్పటికే పీకలోతు ఇరుక్కున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్.. పకడ్బందీగా అడుగులు ముందుకు వేస్తున్నది. సిట్ వేస్తున్న ప్రతి అడుగూ మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగన్ అని తేల్చే దిశగానే సాగుతున్నాయి. మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో టుడు ఆర్ నాట్ టు డు అన్న సందేహానికి వీసమెత్తైనా అవకాశం ఇవ్వకుండా ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ప్రకటించేసి.. అరెస్టుల నుంచి కాపాడాల్సిందంటూ మోడీ, జగన్ లకు శరణుచొచ్చానన్న సంకేతం ఇచ్చేలా జగన్ డ్రెస్, ఫేస్ కూడా మార్చేశారంటున్నారు. బీజేపీ పెద్దలకు విధేయంగా ఉండటం కంటే ఉన్నానన్న సంగతిని కమలనాథులకు కనిపించేలా చేయడం తక్షణ కర్తవ్యంగా భావించిన జగన్ అందుకు తగ్గట్టుగానే అందరి కంటే ముందే ఎన్డీయే అభ్య ర్థి రాథాకృష్ణన్ కు మద్దతు ప్రకటించేశారంటున్నారు. కేసులు, అరెస్టులు, బెయిలు రద్దుల భయంతో జగన్ చేసే రాజకీయం ఇలా కాక మరెలా ఉంటుందంటున్నారు పరిశీలకులు. జగన్ ఈ తరహా రాజకీయమే వైసీపీకి శాపంగా, మరణశాసనంగా మారిందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-politics-with-fear-of-cases-and-bail-cancil-39-204777.html





