విదేశీ పర్యటనకు జగన్.. ఈ సారి ఎందుకోమరి?
Publish Date:Apr 17, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న వేడి, పార్టీ అంతర్గత పరిణామాల మధ్య ఆయన విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకోవడం పార్టీని అయోమయంలో పడేసింది. జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ నెలలోనే ఆయన విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. జగన్ విదేశీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం. ఆయన కుటుంబంతో సహా యూరప్, యూకే పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసు విచారణను ఎదుర్కొంటున్న జగన్, బెయిలుపై ఉన్న నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి తప్పని సరి.. ఈ నేపథ్యంలోనే ఆయన నాంపల్లిలోని సీబీఐ కోర్టులో అనుమతి కోరతూ పిటిషన్ దాఖలు చేయగా, ఆయన పిటిషన్ విచారించిన కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. అయితే వేదేశీ పర్యటనలో ఉండగా ఆయన కాంటాక్ట్ నంబర్, ఈ మెయిల్ ఐడీ సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. వాస్తవానికి 2024 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచీ జగన్ ఎక్కువగా బెంగళూరులోని తన నివాసానికే పరిమితమవుతున్నారు. అప్పుడప్పుడు ఏపీకి వచ్చి పార్టీ సమీక్షల్లో పాల్గొంటున్నప్పటికీ, ఎక్కువ సమయం రాష్ట్రం వెలుపలే గడుపుతున్నారు. ఈ పరిస్థితిపై సొంత పార్టీలోనే ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. జగన్ ఏపీకి వచ్చిన సమయం వినా, మిగిలిన సమయాల్లో వైసీపీ పరిస్థితి రాష్ట్రంలో ఉండీ లేనట్లుగానే ఉంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ విదేశీ పర్యటనపై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. జగన్ గతంలో విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిన సంగతిని ఈ సందర్భంగా పార్టీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. అన్నిటికీ మించి రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాల్సిన కీలక సమయంలో జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడం ఏమిటని పార్టీ వర్గాలు అంటున్నాయి. గత ఎన్నికలలో కనీసం విపక్ష హోదా రాని విధంగా ఘోర పరాజయం తరువాత ప్రజాక్షేత్రంలో ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన జగన్ బెంగళూరులో మకాం వేసి చుట్టపు చూపుగా మాత్రమే ఏపీకి రావడం పట్లే పార్టీ క్యాడర్ లో అసంతృప్తి ఉన్నది. ఇప్పుడు ఏకంగా నెల రోజులకు పైగా విదేశీ పర్యటనకు వెళ్లి రాష్ట్రానికి ముఖం చాటేయడమేంటని పార్టీ నేతలు కూడా అంతర్గత సంభాషణల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-heads-abroad-36-217602.html





