మహిళలను బీజేపీ మోసం చేసింది : కవిత
Publish Date:Apr 17, 2026
Advertisement
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో ఆమె భారతీయ జనతా పార్టీ పై ఘాటు విమర్శలు చేశారు. డీలిమిటేషన్ బిల్లుతో మహిళా రిజర్వేషన్ బిల్లును ముడిపెట్టడం వల్లే లోక్‌సభలో బిల్లు వీగిపోయిందని ఆమె పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనే స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ, కుట్రపూరితంగా రెండు బిల్లులను కలిపి పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చారని కవిత ఆరోపించారు. ఈ చర్యతో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి బిల్లును అడ్డుకున్నాయని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ ప్రయత్నం చేసిందని ఆమె అన్నారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభ సమయంలో ఉమెన్ రిజర్వేషన్ బిల్లును పాస్ చేసి, దానిని జనగణన (సెన్సెస్)కు అనుసంధానించారని గుర్తుచేశారు. ఇప్పుడు 2011 జనగణన ఆధారంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం ద్వారా మరోసారి మహిళలను వంచించారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మహిళలు బీజేపీ మోసాన్ని గుర్తించాలని ఆమె పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో ఒక మహిళ నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో, ఆ రాష్ట్రంలో బీజేపీని ఓడించి ఆ మహిళను గెలిపించాలని తమ స్నేహితులకు చెప్పాలని కవిత సూచించారు.
http://www.teluguone.com/news/content/kalvakuntla-kavitha-received-a-strong-response-36-217627.html





