చేపా చేపా.. రాజుగారి దుకాణంలో ఎందుకు అమ్ముడవ్వడం లేదు!
Publish Date:Jun 20, 2022
Advertisement
అనగనగా ఓ రాజు.. ఆ రాజుగారికి ఓ రోజు అద్భుతమైన ఆలోచన వచ్చింది. అదేమిటంటే తన రాజ్యంలో ప్రజలందరికీ నాణ్యమైన చేపలను అందించాలనీ, తద్వారా నిండుకున్న ఖజానాకు కుప్పతెప్పలుగా ఆదాయం వచ్చి పడుతుందని ఆయన అనుకున్నారు. రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంటుంది? వెంటనే తన మహామంత్రిని పిలిచి తన ఆలోచన చెప్పేరు. బ్రహ్మాండం మహారాజా అంటూ ఆయన మెచ్చేసుకున్నారు. అంతే వెంటనే రాజ్యంలో చాటింపు వేయించేశారు. ఇక జనం అంతా రాజుగారు దయతో ప్రారంభించిన చేపల దుకాణాలలోనే చేపలు కొనుక్కోవాలనీ, వాటిని వండుకు తింటే మాంఛి రుచిగా ఉంటుందనీ. అయితే రాజుగారి ఆలోచన, ఆయన అమ్మే చేపలూ ప్రజలకు నచ్చలేదు. దీంతో రాజుగారి చేపల దుకాణాలు వెలవెల బోతుంటే.. మత్స్యాకారుల దుకాణాలు కిటకిట లాడుతున్నాయి. దీంతో ఆగ్రహించిన రాజుగారు.. రాజ్యంలో తన చేపల దుకాణాలు తప్ప.. ఇంకే చేపల దుకాణాలూ ఉండటానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. సరిగ్గా ఏపీలో పరిస్థితి అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ పాలన తప్ప మిగతావన్నీ చేస్తోంది. ప్రభుత్వ విధానాలను విమర్శించే విపక్ష నేతలపై కేసులు పెడుతోంది, వారిని అర్థరాత్రి అపరాత్రి అని లేకుండా అరెస్టులు చేస్తోంది. విచారణలంటూ పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతోంది. నివాసాలపైకి బుల్ డోజర్లతో దాడులకు దిగి కూల్చివేతలకు సైతం తెగబడుతోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలవారికీ ప్రభుత్వ చేపల రుచి చూపించాలనుకున్నారు జగన్. వెంటనే ఫిష్ ఆంధ్రా అంటూ మార్టులు ప్రారంభించేశారు. తన సొంత నియోజకవర్గం పులివెందుల నుంచీ జగన్ ఈ ప్రభుత్వ చేపల వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే.. పాపం జగన్ ప్రభుత్వ చేపల వ్యాపారం తుస్సు మంది. కొనేవాళ్లు లేక అనతి కాలంలోనే మూత పడ్డాయి. ఫిష్ ఆంధ్రా మార్ట్ కోసం విదేశాల నుంచి తెప్పించిన ఆధునిక శీతలీకరణ యంత్రాలు, మార్టుల కోసం చేసిన ఖర్చూ కూడా వృధా అయ్యింది. దీంతో ప్రభుత్వం చేస్తే నష్టం వస్తున్న చేపల వ్యాపారాన్ని చిన్నా చితకా మత్స్యకారులు ఎలా చేసుకుంటారు అంటూ ఆగ్రహించినట్లుంది. అంతే రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లలో చేపలమ్మే వారిపై విజిలెన్స్ దాడులకు ఉపక్రమించింది. కేసులు పెట్టడం ప్రారంభించింది. ఎందుకంటే వారు చేపలు అమ్మేటప్పుడు తూకం సరిగా వేయడం లేదట. దీని వల్ల పాపం వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారట. చేపల విక్రయదారులపై విజిలెన్స్ దాడులకు ప్రభుత్వం చెబుతున్న కారణమిది. అయితే వినియోగదారులు కూడా చేపల తూకం సరిగా లేకపోవడమేమిటి? మేమేమైనా ఫిర్యాదు చేశామా అంటూ విస్తుపోతున్నారు. ఎందుకంటే చేపల మార్కెట్లో విక్రయాలు, కొనుగోళ్లు అన్నీ చేపల రకం, వాటి సైజు, వాటి ఆకారం బట్టి విక్రయాలు జరుగుతుంటాయి. సాధారణంగా చేపల మార్కెట్లన్నీ ఆదివారాలే కిటకిట లాడుతుంటాయి. చేపల వంట ఒకింత శ్రమతో, సమయం తీసుకునే పని కనుక. అటువంటిది సరిగ్గా ఆదివారం రోజే అధికారులు చేపల మార్కెట్లపై తనిఖీలంటూ పడ్డారు. వందల మందిపై కేసులు పెట్టారు. ప్రభుత్వ ఫిష్ మార్టులు దివాళీ తీస్తే మార్కెట్ లలో చేపలమ్ముకునే వారి దుకాణాలు ఎందుకు కిటకిటలాడాలి అన్న ఆక్రోషంతోనే ఈ దాడులంటూ చేపలమ్ముకునే వాళ్లూ, వనియోగదారులూ కూడా విమర్శలు చేస్తున్నారు. యువతకు ఉపాధి కల్పించడానికి మేం ఫిష్ ఆంధ్రా మార్టులు పెడితే కొనరా.. అసలు మీకు చేపలెలా దొరుకుతాయో చూస్తామన్నట్లుగా ప్రభుత్వం తీరు ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రారంభించిన ఫిష్ ఆంధ్రా మార్టులు కనీసం కరెంటు బిల్లు కట్టే పాటి ఆమ్మకాలు కూడా జరగక మూతపడుతుంటే.. చేపలమ్ముకునే చిన్న చిన్న అమ్మకాలు జోరుగా సాగడానికి ఎలా కుదురుతుందని జగన్ భావిస్తున్నారనీ, అందుకే అధికారులను మార్కెట్లపై దాడులకు ఆదేశించారనీ విపక్షాలు అంటున్నాయి. చేపల మార్కెట్లలో అమ్మకాలకు అవకాశం లేకుండా చేసి ఆంధ్రా ఫిష్ మార్ట్ లకు జనం వచ్చేలా చేయడానికే ఈ దాడులన్న విరమ్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే చేపల వ్యాపారం జోరుగా సాగే ఆదివారం నాడే రాష్ట్ర వ్యాప్తంగా చేపల మార్కెట్లపై దాడులకు ప్రభుత్వం ఉపక్రమించిందని మత్స్యకారులు అంటున్నారు. ప్రభుత్వ తీరుపై మత్స్యకారులలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. చేతకాక మద్దెలు ఓడు అన్న చందంగా ప్రభుత్వం ఆంధ్రాఫిష్ మార్టులు మూత పడటానికి చేపల మార్కెట్లే కారణమని జగన్ ప్రభుత్వం దాడులు చేస్తున్నదని విమర్శిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-government-raids-on-fish-markets-to-improve-sales-in-andhra-fish-marts-25-138079.html





