గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకూ జగన్ వాత
Publish Date:Jun 18, 2022
Advertisement
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ జగన్ చేత, జగన్ కొరకు, జగన్ యెక్క లాంటి వ్యవస్థ. ఇది ఆయన బ్రెయిన్ చైల్డ్. అందుకే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలనగానే నిరుద్యోగులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఉన్నత చదువులు చదవీ, ప్రొఫెషనల్ కోర్సులు చేసీ లక్షల్లో జీతాలొచ్చే అవకాశాలుండీ వాటన్నిటినీ వదులుకుని వేతనం తక్కువైనా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం ఎగబడ్డారు. ఉన్న ఊళ్లో ఉద్యోగం.. వేతనం తక్కువైనా ఫరవాలేదు.. కన్న తల్లిలాంటి ఊర్లోనే దర్జాగా ప్రభుత్వోద్యోగం చేస్తూ కన్న తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకునే భాగ్యం ఉంటుంది, ఇంకే కావాలి అనుకున్నారు. అయితే జగన్ వారి ఊహలను తల్లకిందులు చేసేశారు. వారి ఆశలను నీరు గార్చేశారు. ఉద్యోగాలలోకి తీసుకునేటప్పుడే వీరందరికీ పరీక్షలు నిర్వహించి పాస్ అయిన వాళ్లనే కొలువులోకి తీసుకున్నారు. రెండేళ్లలో అందరికీ ప్రొబేషన్ ఇచ్చి పర్మినెంట్ చేస్తామన్నహామీ కూడా ఇచ్చారు. అయితే రెండేళ్లు దాటిపోయాయి. యథా ప్రకారం జగన్ మాటతప్పారు. మడమ తిప్పారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ కోసం మళ్లీ పరీక్ష నిర్వహించారు. వారిలో సగం మందికి పైగా ఫెయిలయ్యారంటూ చెప్పారు. ప్రోబేషనరీ పరీక్షలో పాసైన వారికే ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తామని చెబుతున్నారు. ఏతా వాతా జగన్ చెప్పేదేమిటంటే లక్షా ఇరవై వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులలో సగం మందికి పైగా ఉద్యోగులకు ప్రోబేషన్ ఉండదు. ఉద్యోగం పర్మనెంట్ కాదు. ఇప్పటికే మూడేళ్లుగా వారు తమ ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎదురు చూపులే మిగులుతాయని జగన్ సర్కార్ తేల్చేసింది.
పర్మనెంట్ అయిన వారికి కూడా పీఆర్సీ ప్రకారం జీతం ఖరారు చేసినా వారికి నెలకు దక్కే వేతనం 23 వేలకు మించదు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సీఎం జగన్ ను నమ్మి పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ ఉద్యో గాలు కూడా వదులుకుని ప్రభుత్వ ఉద్యోగాలలో నిర్భయంగా వుండవచ్చని వచ్చి చేరారు. చివరికి వారు తమ కెరీర్‌లను పోగొట్టుకోవడమే కాదు.. ఇప్పుడు అరకొర జీతాలకు.. భద్రత లేని కొలువులలో కొనసాగుతున్నపరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-decieves-ward-25-137905.html





