political-news-img

మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం కొత్త దిశ : మంత్రి సీతక్క

తెలంగాణ ప్రభుత్వం మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన మహిళా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. మే 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, నాయకత్వ వికాసం, మహిళా భద్రత, బాలికల అభివృద్ధి, పారిశ్రామిక ప్రోత్సాహం వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వారోత్సవాలు గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం సహాయక సంఘాల బలోపేతం, యువతుల్లో నాయకత్వ లక్షణాల పెంపును ప్రధాన లక్ష్యాలుగా ముందుకు తీసుకెళ్లాయి. వారోత్సవాల ప్రారంభ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి భవనాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్య కార్యాలయాలు, వర్క్‌షెడ్లు, గోదాముల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. మహిళా సంఘాల సభ్యులతో ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిలుకపచ్చ రంగు యూనిఫాం చీరలను కూడా ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లా మధిరలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి సౌర విద్యుత్ కేంద్రం ప్రారంభోత్సవం వారోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మహిళలు పునరుత్పాదక ఇంధన రంగంలోనూ విజయవంతంగా రాణించగలరనే సందేశాన్ని ఈ కార్యక్రమం రాష్ట్రానికి అందించింది. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా POSH చట్టంపై అవగాహన కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు నిర్వహించారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం “బాల్య వివాహం – బతుకు ఆగం” పేరిట ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టి సమాజంలో చైతన్యం కల్పించారు. మహిళలను ఉద్యోగాలు కోరుకునే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రుణమేళాలు, జీవనోపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలు, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణకు ప్రాధాన్యతనిస్తూ “బలమైన బాల్యానికి 1000 మెట్లు” కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారు. తొలి వెయ్యి రోజుల ప్రాధాన్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ముగింపు రోజున నిర్వహించిన “అమ్మ మాట – అంగన్వాడీ బాట” కార్యక్రమంలో చిన్నారులకు యూనిఫారాల పంపిణీ, విద్యారంభ ధృవపత్రాల అందజేత, మహిళల అక్షరాస్యతకు సంబంధించిన కార్యక్రమాలు విశేష స్పందన పొందాయి. అలాగే స్నేహ సంఘాల బాలికలతో నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమాలు యువతుల్లో నాయకత్వ సామర్థ్యాలను వెలికితీశాయి. ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందించడంతో పాటు నిర్ణయాత్మక స్థానాల్లో మహిళల పాత్ర ఎంత కీలకమో తెలియజేశాయి. వారంరోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో లక్షలాది మంది మహిళలు, బాలికలు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములయ్యారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెరగడం, మహిళల్లో వ్యాపార ఆలోచనలు బలోపేతం కావడం, నాయకత్వ లక్షణాలు పెంపొందడం వంటి సానుకూల ఫలితాలు కనిపించాయి. మహిళా సాధికారతను ప్రజా ఉద్యమంగా మలచాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ఈ వారోత్సవాలు బలమైన పునాది వేశాయని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు బలపడితే కుటుంబం, సమాజం, రాష్ట్రం బలపడుతుందనే నమ్మకంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు.

Publish Date: May 31, 2026 5:44PM

political-news-img

30 ఏళ్ల నిరీక్షణకు తెర...రేపటి నుంచే విశాఖ రైల్వే జోన్

విశాఖ జోన్‌పై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్‌ మాధవ్‌ కీలక వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త రవాణా విప్లవానికి వేదిక కాబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచే అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీనితో పాటు విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్టు కూడా అందుబాటులోకి రానుందని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏపీ బీజేపీ విభాగం ఈ వ్యవహారంపై కీలక వివరాలను వెల్లడించింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను తీసుకురావడానికి దాదాపు ముప్పై ఏళ్లుగా అనేక పోరాటాలు జరిగాయని ఆ పార్టీ గుర్తుచేసింది. రాష్ట్ర విభజన చట్టంలో ఈ రైల్వే జోన్ ఏర్పాటును ఒక ప్రధాన హామీగా చేర్చడం వెనుక, దానిని సాకారం చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతో ఉందని పార్టీ స్పష్టం చేసింది. తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో జరిగిన భేటీ విశాఖకు మరిన్ని వరాలు తెచ్చిపెట్టింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక వసతులను భారీగా విస్తరించనున్నట్లు కేంద్రం సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విశాఖను కలుపుతూ బుల్లెట్ రైలును నడపడానికి అవసరమైన కార్యాచరణ సిద్ధమవుతోందని రైల్వే శాఖ హామీ ఇచ్చినట్లు ఏపీ బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఏపీకి ఈ తరహా భారీ కేటాయింపులు జరిపినందుకు కేంద్ర మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయంగా ఈ పరిణామం ఏపీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే జోన్ కార్యరూపం దాల్చడం పట్ల ఉత్తరాంధ్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక వ్యాపార, పారిశ్రామిక రంగాలు సైతం ఈ నిర్ణయం వల్ల విశాఖ రూపురేఖలు మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, జోన్ ప్రకటనతో పాటు బుల్లెట్ రైలు వంటి అత్యాధునిక రవాణా వ్యవస్థల నిర్మాణం ఊపందుకుంటే, ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుల భూసేకరణ, నిధుల విడుదల ఏ విధంగా సాగుతుందనే అంశంపైనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో ఉత్తరాంధ్ర ప్రాంతం ఆర్థిక హబ్‌గా మారేందుకు ఇవి ఎంతగానో దోహదపడనున్నాయి.

Publish Date: May 31, 2026 4:40PM

political-news-img

అమ్మవారి అన్నప్రసాదాలు అద్భుతం...భక్తుల ప్రశంసలు

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లే శ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతపై ఆలయ ఈవో శీనా నాయక్ ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మధ్యాహ్నం మహా మండపంలో జరుగుతున్న అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, క్యూ లైన్‌లో ఉన్న భక్తులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం మొదటి అంతస్తులో బఫే విధానంలో, రెండో అంతస్తులోని కామన్ హాల్‌లో భోజనం చేస్తున్న భక్తులను కలిసి అన్నప్రసాదాల రుచి, నాణ్యత, పరిశుభ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు అన్న ప్రసాదాలు ఎంతో రుచిక రంగా, నాణ్యంగా ఉన్నాయని, సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని ప్రశంసిం చారు. భక్తుల నుంచి వచ్చిన సానుకూల స్పందనతో ఈవో సంతృప్తి వ్యక్తం చేయగా, అన్నప్రసాదాల నిర్వహణలో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు ఎప్పటికప్పుడు పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇంద్ర కీలాద్రి క్షేత్రంలో భక్తులకు అందిస్తున్న అన్నసేవపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

Publish Date: May 31, 2026 4:23PM

political-news-img

రైతు బిడ్డగా మరోసారి నిరూపించిన మంత్రి నిమ్మల రామానాయుడు

7 కిలోమీటర్ల సైకిల్‌పై ప్రయాణించి స్వగ్రామానికి చేరుకున్నారు.. రొయ్యలకు మేత వేసి, పొలంలో దుక్కి దున్ని.. సైకిల్‌పై ప్రయాణించి, తన పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి.. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తన రైతు మనసును చాటుకున్నారు. అధికార హోదా, ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి స్వగ్రామం అగర్తిపాలెంలో వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాలకు విరామం ఉండటంతో పాలకొల్లు నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్‌పై ప్రయాణించి స్వగ్రామానికి చేరుకున్నారు. మార్గమధ్యంలో ప్రజలను కలుసుకుని వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. గ్రామానికి చేరుకున్న అనంతరం తన సొంత రొయ్యల చెరువును సందర్శించిన మంత్రి, మేత వేసి రొయ్యల ఎదుగుదలను పరిశీలించారు. అనంతరం పొలంలోకి వెళ్లి కూలీలతో కలిసి ట్రాక్టర్‌పై దుక్కి దున్నారు. వ్యవసాయ పనుల్లో నేరుగా పాల్గొని రైతులతో మమేకమయ్యారు.మంత్రి నిమ్మల రామానాయుడు సాధారణ రైతులా వ్యవహరించడం స్థానికులను ఆకట్టుకుంది. ప్రజల మధ్య కలిసిమెలిసి వ్యవసాయ పనులు చేయడాన్ని పలువురు అభినందిస్తున్నారు. సాధారణంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు పర్యటనలకు వచ్చినప్పుడు కాన్వాయ్‌లు, భారీ భద్రతతో హడావుడి కనిపిస్తుంది. కానీ, రామానాయుడు మాత్రం వీటన్నింటికీ భిన్నంగా చాలా సాధారణంగా వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. తన సొంత ఊరి మట్టితో ఉన్న అనుబంధాన్ని చాటుకుంటూ ఆయన చేసిన ఈ పని స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. పొలంలో పనులు చేస్తున్న సమయంలో స్థానిక రైతులు, కూలీలతో మంత్రి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, సాగునీటి లభ్యత, విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి పలు కీలక అంశాలపై వారితో చర్చించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికే తాను ఇలా వచ్చానని ఆయన పేర్కొన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు తీసుకున్న ఈ వినూత్న నిర్ణయంపై సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి కానీ మాతృభూమిని, వ్యవసాయాన్ని మరువకూడదనే సందేశాన్ని ఆయన ఈ చర్య ద్వారా ఇచ్చారని నెటిజన్లు కొనియాడుతున్నారు. మరోవైపు సొంత ఊరి ప్రజలు సైతం తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి మంత్రి అయినప్పటికీ, పాత రోజులను గుర్తుచేసుకుంటూ తమతో కలిసిపోవడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మల రామానాయుడు ఎప్పుడూ ప్రజల్లో ఉండేందుకే ఇష్టపడతారని ఈ ఘటనతో మరోసారి రుజువైందని స్థానిక నేతలు అంటున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, సాగునీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా మరిన్ని సమస్యలను పరిష్కరించి, అన్నదాతలకు అండగా ఉంటామని ప్రజలు ఆశిస్తున్నారు.

Publish Date: May 31, 2026 4:06PM

political-news-img

బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తత...టీఎంసీ ఎంపీపై దాడి తలకు తీవ్ర గాయం!

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్రమైన ఉద్రిక్తతలకు వేదికగా మారాయి. రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఆదివారం (మే 31) హుగ్లీ జిల్లాలోని చండితాల పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతం ఒక్కసారిగా రణరంగమైంది. టీఎంసీ నాయకులు, కార్యకర్తల అరెస్టులను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట టీఎంసీ శ్రేణులు భారీ ధర్నాకు దిగాయి. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా వ్యతిరేక నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. ఈ వాగ్వాదం కాస్తా కొద్దిసేపట్లోనే పరస్పర దాడులకు దారితీసింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న క్రమంలో అక్కడే ఉన్న టీఎంసీ సీనియర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘర్షణల్లో ఆయన తలకు బలమైన గాయం కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. బెంగాల్ రాజకీయాల్లో కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు కీలకమైన టీఎంసీ ఎంపీలపై వరుస దాడులు జరగడం ఇక్కడి శాంతిభద్రతల పరిస్థితిని కళ్ళకు కడుతోంది. శనివారం నాడే టీఎంసీ ఎంపీ, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అయిన అభిషేక్ బెనర్జీపై సోనాపూర్‌లో కొందరు దుండగులు కోడిగుడ్లు, టమాటాలతో దాడికి తెగబడ్డారు. ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో అభిషేక్ బెనర్జీకి ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ దాడికి సంబంధించిన విజువల్స్, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఘోర పరాభవం జరిగి 24 గంటలు కూడా గడవక ముందే, ఆదివారం నాడు మరో ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి జరగడం, ఆయన రక్తం చిందించేలా తలకు గాయం కావడం రాజకీయ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తనపై జరిగిన దాడిపై ఎంపీ అభిషేక్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడి పూర్తిగా ముందస్తు ప్రణాళికతో, పక్కా స్కెచ్ ప్రకారం జరిగిందని ఆయన ఆరోపించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ కనీసం పోలీసులు కూడా లేకపోవడంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. స్థానిక యంత్రాంగం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. ఈ దాడి అనంతరం ఆయన కోల్‌కతాలో అత్యవసర చికిత్స పొందాల్సి వచ్చింది. అయితే, చికిత్స ముగిసిన వెంటనే ఆయన వెనక్కి తగ్గకుండా తన పర్యటనను యథావిధిగా కొనసాగించారు. ఇదిలా ఉండగా, రాజకీయంగా దాడులు ఎదుర్కొంటున్న అభిషేక్ బెనర్జీకి చట్టపరమైన చిక్కులు కూడా తోడయ్యాయి. అదే రోజున నకిలీ సంతకాల కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సీఐడీ విభాగం నుంచి ఆయనకు కీలకమైన నోటీసులు అందడం గమనార్హం. వరుసగా జరుగుతున్న ఈ రాజకీయ దాడులు పశ్చిమ బెంగాల్‌లో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనన్న భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. చండితాల పోలీస్ స్టేషన్ పరిధిలో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఒకవైపు దాడులు, మరోవైపు సీఐడీ నోటీసులతో బెంగాల్ రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. ఈ వరుస దాడులపై టీఎంసీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రతిపక్షాల కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేస్తోంది.

Publish Date: May 31, 2026 3:26PM

political-news-img

నకిలీ జీఓలతో ప్రభుత్వ భూమి కాజేసే కుట్ర భగ్నం

హైదరాబాద్ శివారులోని గండిపేట ప్రాంతంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో కాజేసి విక్రయించేందుకు ప్రయత్నించిన భారీ భూ మోసాన్ని షేర్ లింగంపల్లి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నిమ్మల కుటుంబ సభ్యులతో పాటు పలువురిపై కేసులు నమోదు చేసి, ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యేతో సహా పలువురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. షేర్ లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. వెల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి అడ్వకేట్ అయినప్పటికీ తాను సచివాలయంలో ఉద్యోగిగా, అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు. తన పేరుకు చివర "డాక్టర్" అనే పదాన్ని కూడా జోడించుకొని పలువురిని మోసం చేసినట్లు గుర్తించారు.గండిపేట పరిధిలోని సర్వే నెంబర్ 18లో ఉన్న ప్రభుత్వ పోరంబోకు భూమిపై హక్కులు ఉన్నట్లు చూపిస్తూ నిమ్మల కుటుంబ సభ్యులు చాలా కాలంగా క్లెయిమ్ చేస్తున్నారు. ఇందుకోసం నకిలీ జీఓలు, ఫోర్జరీ పత్రాలు సృష్టించి భూమి తమ పేరుపై క్రమబద్ధీకరించబడిందని ప్రచారం చేశారు. ఐదు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓలు) తయారు చేసి వాటిని వాట్సాప్, సోషల్ మీడియా వేదికల ద్వారా వైరల్ చేశారు. భూమి యాజమాన్య హక్కుల కోసం నిందితులు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, 2025 అక్టోబర్‌లో వారి పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ చట్టబద్ధమైన హక్కులు లేకుండానే ఎకరాకు రూ.3.5 కోట్ల చొప్పున భూమిని విక్రయించేందుకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ అక్రమ భూ డీల్‌లో వినుకొండకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేరు కూడా వెలుగులోకి వచ్చింది. నిందితులు బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్‌లతో భూమి అమ్మకానికి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్రహ్మనాయుడు నుంచి నిమ్మల కుటుంబ సభ్యుల ఖాతాలకు రెండు విడతల్లో రూ.1 కోటి, రూ.25 లక్షలు బదిలీ అయినట్లు ఆధారాలు లభించాయి. మొత్తంగా ఈ అక్రమ భూ వ్యవహారంలో రూ.1500 కోట్లకు పైగా చేతులు మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ పాస్‌బుక్స్, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సహా కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయికిరణ్‌లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బొల్లా రమేష్, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సునీల్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ భూములను నకిలీ పత్రాలతో కాజేసే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

Publish Date: May 31, 2026 3:06PM

MOVIE NEWS