కోదండరాం నేతృత్వంలో మరో ఉద్యమం!
Publish Date:Aug 6, 2016
Advertisement
సుదీర్ఘకాలపు ఉద్యమం, ఆరువందలకు పైగా నిరసనకారుల ప్రాణత్యాగంతో... దేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. బడుగు తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తామంటూ కొత్త ప్రభుత్వం కోటి ఆశలతో ముందుకొచ్చింది. కానీ తెలంగాణ ఏర్పడి రెండేళ్లు గడిచిన తరువాత కూడా పైపై మెరుగులే తప్ప పేదల బతుకు పెద్దగా మారలేదన్న అసంతృప్తి కొందరిలో లేకపోలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో తన భవిష్యత్తుని పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్న యువత ఇప్పుడు నిరుద్యోగంతో విసిగెత్తిపోతోంది. ఇలాంటి యువకులంతా కలిసి కోదండరాం నేతృత్వంలో మరోసారి ఉద్యమించేందుకు రంగం సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వం నిదానంగా కోదండరాం నేతృత్వంలోని జె.ఎ.సిని నీరుగార్చడం మొదలుపెట్టింది. జె.ఎ.సి. అవసరమే లేదనుకున్నారో లేక తమ అధికారానికి ప్రత్యామ్నాయంగా మారుతుందనుకున్నారో టీఆర్‌ఎస్ నేతలంతా నిదానంగా జె.ఎ.సి. నుంచి తప్పుకున్నారు. అప్పటివరకూ కె.సి.ఆర్ తరువాత అంతటి ప్రచారాన్ని సాధించిన కోదండరాం హవా నిదాంగా తగ్గడం మొదలైంది. కోదండరాం కూడా ఈ పరిణామాన్ని చూసీ చూడనట్లు ఊరుకున్నట్లు కనిపించింది. తెలంగాణ తన రెండో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న దగ్గరనుంచీ కోదండరాం తీరు మారిపోయింది. ప్రభుత్వం మీద పదునైన వ్యాఖ్యలను చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం తన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయిందనీ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదని విమర్శలు మొదలుపెట్టారు. సహజంగానే కోదండరాం వ్యాఖ్యల మీద టీ.ఆర్.ఎస్ శ్రేణులన్నీ విరుచుకుపడ్డాయి. వారూవీరూ అని లేకుండా మంత్రులంతా తలా ఓ మాటా అనేశారు. కానీ నిదానంగా తమ విమర్శల పదును తగ్గించుకున్నారు. రాష్ట్ర ప్రజల్లోని అసంతృప్తిని గమనించే కోదండరాం మాట్లాడుతున్నారనీ, అందుకనే ఆయనను టీ.ఆర్.ఎస్ నేతలు రెచ్చగొట్టకుండా మిన్నకున్నారనీ... ఓ వాదన వినిపించింది. టీ.ఆర్.ఎస్ నేతలు భయపడినట్లుగానే కోదండరాం నిదానంగా ప్రజల్లోకి అసంతృప్తికి ఒక ప్రతినిధిగా మారుతున్నట్లు తోస్తోంది. మల్లన్నసాగర్ నిర్వాసితుల ఆక్రోశం; మెదక్‌లో భూసేకరణను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు; ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం; రెండేళ్లు గడుస్తున్నా గ్రూప్1 వంటి ఉద్యోగాలు భర్తీ కాకపోవడం.. తదితర వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు కొందరిలో `All is not well` అనే భావనని కలుగచేస్తున్నాయి. ఈ అసంతృప్తి ఆధారంగా కోదండరాం మరో ఉద్యమానికి తెరతీస్తున్నట్లు కనిపిస్తోంది. దానికి అనుగుణంగా కోదండరాం తరచుగా, ఘాటుగా విమర్శలు చేయడం పత్రికల నిండా కనిపిస్తోంది. ఒక ఉద్యమకర్తగా కోదండరాంను తీసిపారేయడానికి ఏమాత్రం వీల్లేదన్న విషయం టీ.ఆర్.ఎస్ నేతలకు బాగా తెలుసు. కాబట్టి అధికారం ఉంది కదా అని ఆయన రగిలిస్తున్న అసంతృప్తినీ, వాటి వెనుక ఉన్న కారణాలనీ ఉదాసీనంగా తీసుకుంటే... ఇప్పటికిప్పుడు కాకున్నా వచ్చే ఎన్నికలలో అయినా ఆ పార్టీ భంగపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే కోదండరాం ఉపాధి కల్పన కోసం తాము దసరా నుంచి ఉధృతమైన ఉద్యమాన్ని చేయనున్నట్లు ప్రకటించేశారు. మరి ప్రభుత్వం పట్టువిడుపులకు పోకుండా తగిన హామీలతో, కార్యాచరణతో ముందుకు వస్తే సరే సరి! లేకపోతే ఏ యువత ఉద్యమాల ఆధారంగా తాము అధికారంలోకి వచ్చారో, ఆ యువతకే వ్యతిరేక దిశలో నిలిచే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/jac-kodandaram-37-64766.html





