ఉద్యమం ఊపిరి ఆగిపోయింది
Publish Date:Aug 8, 2016
Advertisement
సారా మహమ్మారి కబంద హస్తాల్లో చిక్కి కుటుంబాలకు కుటుంబాలే విచ్ఛిన్నమవ్వడం చూసి సారాకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రజలను, ప్రభుత్వాన్ని కదిలించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను సంపూర్ణ మద్య నిషేధం దిశగా నడిపిన ఉద్యమ నాయకురాలు దూబగుంట రోశమ్మ ఇకలేరు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆమె..నెల్లూరు జిల్లా కలిగిరి మండలం దూబగుంటలోని స్వగృహంలో మరణించారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెంలోని ఓ సామాన్య రైతు జక్కంపూడి పిచ్చయ్య, సుబ్బమ్మలకు మూడో సంతానంగా జన్మించారు రోశమ్మ. 16వ ఏటనే కలిగిరి మండలం తూర్పు దూబగుంటకి చెందిన వర్థినేని కొండయ్యతో ఆమెకు వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. సాఫీగా సాగుతున్న వారి కుటుంబంలో సారా మహమ్మారి చిచ్చు పెట్టింది. సారాకు బానిసై భర్త చనిపోగా..ఇద్దరు కొడుకులు కూడా సారా మత్తులో తూగుతుండేవారు. సారా తన కుటుంబాన్నే కాకుండా ఎందరి జీవితాలనో కకావికలం చేయడం..లెక్కకు మిక్కిలి కుటుంబాలు రోడ్డున పడటం ఆమెను కలచివేసింది. దీంతో ఈ రక్కసిని తరిమికొట్టేదెలా..? ఇవే ఆలోచనలు ఆమెకు నిద్ర లేకుండా చేశాయి. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా "అక్షర దీపం" కార్యక్రమం ఊపందుకుంది. సారా తాగి మగాళ్లు పెట్టే బాధలకు విసుగుచెందిన దూబగుంట మహిళలు, అక్షరదీపం పుస్తకాల్లో "సీతమ్మకథ" పాఠం స్పూర్తితో 1993 అక్టోబర్ రెండో తేదీన గ్రామానికి వస్తున్న కల్లు, సారా వాహనాన్ని ఊరు బయటే అడ్డుకున్నారు. అంతేకాకుండా జీపులోని కల్లు, సారా ప్యాకెట్లను తగులబెట్టారు. వ్యాపారులు, పోలీసుల సాయంతో అమ్మకాలు జరపాలని చూశారు. కొందరు మగాళ్లు తమ ఇళ్లలో మహిళలపై దాడులు చేయడంతో కొంతమంది మహిళలు వెనక్కి తగ్గారు. కానీ రోశమ్మ మాత్రం వెనకడుగు వేయలేదు. సారా మాఫియా ఆగడాలు, పోలీసుల కేసులు, పెద్దల బెదిరింపులు వంటి ఎన్నింటినో తట్టుకుని ఉద్యమంలా ముందుకుసాగారు. జిల్లాలోనే గాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి మహిళల్లో చైతన్యం తీసుకువచ్చారు. అలా ఆంధ్రదేశం మొత్తం సారా వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. మహిళల్లో చైతన్యం పెరిగింది..రాజకీయ పార్టీలు ఉద్యమ తీవ్రతను గుర్తించాయి. రోశమ్మ ఉద్యమంతో కదిలిన ఆనాటి ప్రతిపక్షనేత ఎన్టీఆర్ తన ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధికారంలోకి వస్తే "సంపూర్ణ మద్యపాన నిషేధం" అమలు చేస్తామని ప్రకటించారు. ఆయన మాట మీద నమ్మకంతో ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం 1995 జూన్ 1 నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ ఎన్టీఆర్ తొలి సంతకం చేశారు. అది చూసిన రోశమ్మ ఆనందానికి అవధుల్లేవు. ఇలా రోశమ్మకు లభించిన గుర్తింపు ఆమె పేరును మార్చేసింది..అప్పటి నుంచి ఆవిడ "దూబగుంట" రోశమ్మగా మారిపోయారు. రాష్ట్రంలో అంతటి కదలిక తెచ్చి మద్యపాన నిషేధాన్ని సాధించిన రోశమ్మ చివరి దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం నుంచి ఆమెకు ఎటువంటి సాయమందలేదు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ..కనీసం వైద్య పరీక్షలు చేయించుకునే ఆర్థిక స్థోమత కూడా లేక మంచంపట్టారు. మూడు రోజుల నుంచి పరిస్థితి మరింత క్షీణించడంతో నిన్న ఉదయం ఎనిమిది గంటల సమయంలో 93 ఏళ్ల వయసులో రోశమ్మ తుదిశ్వాస విడిచారు. మంచంలో ఉండే చనిపోతానని తెలిసి కూడా సంపూర్ణ మద్యనిషేధమే తన చివరి కోరికని చెప్పడం ఉద్యమం పట్ల ఆమెకున్న పట్టుదలను తెలియజేస్తోంది. ఆమె మరణవార్త తెలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళా లోకానికే ఆమె ఆదర్శమని కొనియాడారు. సమాజంలో మద్యం వల్ల రోజు రోజుకి పెరుగుతున్న ప్రమాదాలు చూస్తుంటే..రమ్య లాంటి చిన్నారులు ఇంకా బలికాకుండా ఉండాలంటే ఇలాంటి రోశమ్మలు మళ్లీ పుట్టాల్సిన అవసరం ఉంది.
http://www.teluguone.com/news/content/anti-liquor-agitation-1993-37-64852.html





