సోనూసూద్‌పై మళ్లీ ఐటీ రైడ్స్.. బీజేపీ టార్గెట్ చేస్తోందా?
Publish Date:Sep 16, 2021
Advertisement
సోనూసూద్. ఈ పేరు ఇప్పుడు సేవకు ప్రతిరూపం. సోనూ నటుడి స్థానికి దాటేశారు. నేషన్ ఐకాన్‌గా నిలిచారు. కొవిడ్ సమయంలో సోనూసూద్ చేసిన సేవలకు జనం నీరాజనం పలుకుతున్నారు. ప్రభుత్వాలకన్నా.. సోనూసూద్‌పైనే ప్రజలకు నమ్మకం పెరిగింది. అలాంటి ఆయనపై సడెన్‌గా ఐటీ రైడ్స్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఈ నేషన్ హీరోను విలన్‌గా చిత్రీకరించే కార్యక్రమం ఎందుకు జరుగుతోంది? సోనూసూద్ నిజంగా ఏమైనా అవకతవకలకు పాల్పడ్డారా? లేక, సోషల్ మీడియాలో హెరెత్తుతున్నట్టు.. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంతో జతకట్టినందుకు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే సోనూసూద్‌ను టార్గెట్ చేసిందా? ఇలా అనేక ఆరోపణలు. బుధవారం ముంబై, లక్నోలోని సోనూసూద్ నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేసిన ఐటీ అధికారులు, గురువారం మరోసారి ముంబైలోని సోనూసూద్ ఇంట్లో సోదాలు చేశారు. లక్నోకు చెందిన రియల్‌ఎస్టేట్ కంపెనీతో చేసుకున్న ఒప్పందంపై సోనూను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. పన్ను ఎగవేతకు సంబంధించిన ఓ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి, లక్నో నగరాల్లోని సోనూసూద్‌కు చెందిన ఆరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు బుధవారం సోదాలు జరిపారు. ఏకకాలంలో దాదాపు 20 గంటల పాటు ఈ తనిఖీలు నిర్వహించారు. లక్నోలోని ఓ స్థిరాస్తి సంస్థతో సోనూసూద్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో పన్ను ఎగవేత అనుమానాలు ఉన్నాయంటూ ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ఇదంతా రాజకీయ కక్ష్య సాధింపు చర్యలే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సోనూసూద్.. ఢిల్లీ ‘ఆప్’ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. సీఎం కేజ్రీవాల్‌ను కలిసి ఆయనతో కలిసి పని చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాతే ఇలా సోనూపై ఐటీ రైడ్స్ జరగడం కలకలం రేపుతోంది. ఆప్‌తో కలిసినందునే సోనూసూద్‌ను ఐటీ దాడులతో భయపెడుతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కొవిడ్ వేళ వలసకూలీలతో పాటు ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తిపై కుట్రపూరితంగా ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/is-bjp-targeting-sonusood-with-it-raids-25-123068.html





