టి20 సిరీస్.. టీమ్ ఇండియాను క్లీన్ స్వీప్ చేసిన ఐర్లాండ్
Publish Date:Jun 28, 2026
Advertisement
పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్‌కు పరాభవం ఎదురైంది. బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించి రెండు మ్యాచ్ ల టి20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఓటమితో టీమిండియా 16 సిరీస్‌ల విజయాల జైత్రయాత్రకు తెరపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆ జట్టులో హ్యారీ టెక్టర్ హాఫ్ సెంచరీతో రాణించగా, బెంజమిన్ 37 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే చెరో రెండు వికెట్లు తీశారు. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. , ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తిలక్ వర్మ 46 బంతుల్లో 55 ఒంటరి పోరాటం చేసినప్పటికీ, ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. చివరి ఓవర్లలో హర్షిత్ రాణా 10 బంతుల్లో 21 మెరుపులు మెరిపించినా.. భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఐర్లాండ్ బౌలర్లలో జై మూంద్రా, మాథ్యూ హొల్లార్డ్ చెరో 3 వికెట్లు తీసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మార్క్ అడైర్, పాల్ స్టిర్లింగ్ వంటి కీలక ఆటగాళ్లు లేకుండానే ఐర్లాండ్ ఈ అద్భుత విజయం సాధించడం విశేషం. టీమిండియా టీ20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ తొలి సిరీస్ లోనే ప్రతికూల ఫలితాన్ని ఎదుర్కొన్నాడు. ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌ను కోల్పోయిన తర్వాత భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. పిచ్‌ను అర్థం చేసుకోవడంలో, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటంలో ప్రత్యర్థి జట్టు తమకంటే మెరుగ్గా వ్యవహరించిందని ప్రశంసించాడు. పిచ్ ను అంచనా వేయడలో తాము విఫలమయ్యామని చెప్పిన టీమ్ ఇండియా స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్.. ఆ విషయంలో ఐర్లాండ్ మమ్మల్ని పూర్తిగా మించిపోయిందన్నాడు.
http://www.teluguone.com/news/content/irland-vlean-sweep-india-36-224425.html





