పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు
Publish Date:Dec 20, 2025
Advertisement
సంచలనాలకు కేంద్రబిందువైన పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రిన్ - ఇ- ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు ఊహించని షాక్ తగిలింది. తొషఖానా - 2 అవినీతి కేసులో ఫెడరల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు కఠిన శిక్ష విధించడం అటు పాకిస్థాన్‌తో పాటు ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. తొషఖానా - 2 అవినీతి కేసులో ఫెడరల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఉన్న రావల్పిండిలోని అడియాలా జైలులోనే విచారణ జరిపిన న్యాయస్థానం ఈ తీర్పులు వెలువరించడం గమనార్హం. 2021 మే నెలలో సౌదీలో ఇమ్రాన్ పర్యటించారు. 2021 మే నెలలో సౌదీ అరేబియా పర్యటించిన సందర్భంగా యువరాజు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు ఖరీదైన ‘బల్గరి’ నగల సెట్‌ను బహుమతిగా అందజేశారు. ప్రభుత్వ ఖాజానాకు అప్పగించకుండా ఇమ్రాన్ అతని భార్య బుష్రా సొంత ప్రయోజనం కోసం తక్కువ ధరకు విక్రయించినట్లు వచ్చిన ఆరోపణపై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి షారుఖ్ అర్జుమంద్ ఈ సంచలన తీర్పు ప్రకటించారు. ప్రధాని హూదాలో ఉంటూ నమ్మకద్రోహానికి పాల్పడినందుకు పాకిస్థాన్ పీనల్ కోడ్ సెక్షన్ 409 కింద 10 ఏళ్లు కఠిన శిక్ష, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద 7 ఏళ్లు సాధారణ శిక్ష విధించారు. అంతేకాదు దంపతులకు చెరో రూ.16.4 మిలియన్ జరిమానా కూడా విధించారు. ఈ తీర్పుతో ఇమ్రాన్ ఖాన్ మరో పదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ తీర్పును హై కోర్టులో సవాలు చేస్తామని ఇమ్రాన్ ఖాన్ తరుపు న్యాయవాది తెలిపారు.
http://www.teluguone.com/news/content/imran-khan-36-211341.html





