ఐబొమ్మ రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు
Publish Date:Feb 17, 2026
Advertisement
హైదరాబాదు నగరంలో సంచలనం సృష్టించిన కేసులో అరెస్టైన ఐబొమ్మ రవికు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయస్థానం కఠిన నిబంధనలు విధిస్తూ బెయిల్ మంజూరు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసు స్వభావాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు, విచారణపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకు పలు ఆంక్షలు విధించింది. బెయిల్ షరతుల ప్రకారం కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని స్పష్టం చేసింది. అలాగే తన పాస్‌పోర్ట్‌ను కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు దేశం విడిచి వెళ్లే అవకాశాన్ని పూర్తిగా నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ వినియోగంపై కూడా ప్రత్యేక నిబంధనలు విధించడం గమనార్హం. స్వేచ్ఛగా ఇంటర్నెట్ వాడకూడదని, అవసరమైతే పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే వినియోగించుకోవాలని కోర్టు పేర్కొంది. కేసుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండేందుకే ఈ ఆంక్షలు విధించినట్లు న్యాయవర్గాలు చెబు తున్నాయి. విచారణకు పూర్తిగా సహకరించాలని, అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారుల ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. విధించిన షరతులను ఏదైనా విధంగా ఉల్లంఘించిన పక్షంలో బెయిల్ రద్దు చేసే అవకాశం ఉందని స్పష్టమైన హెచ్చరిక చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక వివరాలు బయటకు వచ్చిన నేపథ్యంలో బెయిల్ మంజూరు కీలకంగా మారింది. మరోవైపు కోర్టు విధించిన కఠిన షరతులు కేసు దర్యాప్తు ఎంత సీరియస్‌గా కొనసాగుతోందో తెలియజేస్తున్నాయి. న్యాయస్థానం నిర్ణయంతో ఒకవైపు ఐబొమ్మ రవికు తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ, విచారణ పూర్తయ్యే వరకు అతను న్యాయపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
http://www.teluguone.com/news/content/ibomma-ravi-granted-bail-36-214245.html





