బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైడ్రా నోటీసులు
Publish Date:Aug 28, 2024
Advertisement
తెలంగాణ ప్రభుత్వం అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా పని మొదలెట్టేసింది. ఇప్పటికే నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సహా పలు అక్రమ కట్టడాలను కూల్చివేసింది. చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆయన చెరువును ఆక్రమించి విద్యాసంస్థలు నిర్మించారంటూ నోటీసులు జారీ చేసింది. మర్రి రాజశేఖరరెడ్డికి చెందిన ఎమ్ ఎల్ ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలను చిన్న దామెర చెరువు ను ఆక్రమించి నిర్మించినట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు మర్రిరాజశేఖరరెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే ఆయనకు చెందిన విద్యాసంస్థల కూల్చివేతపై ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం లేదు. అయితే మరో వైపు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నిబంధనలను అతిక్రమించి నిర్మించిన విద్యాసంస్థల విషయంలో వాటి యాజమాన్యాలకు కొంత సమయం ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. వాటిపై తక్షణ చర్యలు తీసుకోబోమని పేర్కొన్నారు. విద్యాసంవత్సరం మధ్యలో ఉన్నందున అటువంటి విద్యాసంస్థలకు నోటీసులు జారీ చేస్తామన్నారు. విద్యార్థులను తరలించిన తరువాత ఆ కట్టడాలను వారంతట వారే కూల్చి వేసుకోవాల్సి ఉంటుందన్నారు. అలా జరగకపోతే అప్పుడు హైడ్రా రంగంలోకి దిగుతుందని రంగనాథ్ పేర్కొన్నారు. ఆ సందర్భంగా ఆయన మల్లారెడ్డి, ఒవైసీల పేరు ప్రస్తావించారు. నిబంధనలను అతిక్రమించి నిర్మించిన కట్టడాల విషయంలో మల్లారెడ్డి అయినా, ఒవైసీ అయినా హైడ్రా ఒకేలా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/hydraa-notices-to-brs-mla-39-183760.html





