హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీతో నకిలీ ఎన్ఓసీలు.!
Publish Date:Aug 5, 2026
Advertisement
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలను సృష్టించి ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించిన వ్యవహారం కలకలం రేపుతోంది. మొత్తం 76 జూనియర్ కాలేజీలు ఫైర్ ఎన్‌ఓసీలను సమర్పించగా, వాటిలో ఎనిమిది కాలేజీలు నకిలీ, ఫోర్జ్డ్ ఎన్‌ఓసీలను సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై హైడ్రా అడిషనల్ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు లేక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫైర్ ఎన్‌ఓసీలు జారీ చేసే అధికారం హైడ్రాకు ఉన్నప్పటికీ.. సంబంధిత కాలేజీలకు హైడ్రా నుంచి ఎలాంటి ఎన్‌ఓసీలు జారీ కాలేదని అధికారులు గుర్తించారు. హైడ్రా పేరుతో నకిలీ పత్రాలను తయారు చేసి, వాటిపై కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పత్రాల పరిశీలన సందర్భంగా ఈ నకిలీ ఎన్‌ఓసీల వ్యవహారం బయటపడినట్లు సమాచారం. నకిలీ ఎన్‌ఓసీలు సమర్పించినట్లు గుర్తించిన కాలేజీల్లో బర్కత్‌పురలోని హైందవి జూనియర్ కాలేజీ, ఎస్‌ఆర్ నగర్‌లోని రెజొనెన్స్ జూనియర్ కాలేజీ, మెహదీపట్నంలోని ప్రియాంక జూనియర్ కాలేజీ ఫర్ గర్ల్స్, విద్యానగర్‌లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజీ, చాంద్రాయణగుట్టలోని శ్రీ చంద్ర జూనియర్ కాలేజీ, చిక్కడపల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజీ, శివరాంపల్లిలోని షాహీన్ జూనియర్ కాలేజీ, సంగారెడ్డి జిల్లా ఆర్‌సీ పురం పరిధిలోని తెల్లాపూర్‌లో ఉన్న వశిష్ట జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై హైడ్రా అధికారులు లేక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ ఎన్‌ఓసీలను ఎవరు రూపొందించారు, వాటిపై కమిషనర్ సంతకాన్ని ఎలా ఫోర్జరీ చేశారు, కాలేజీల యాజమాన్యాలకు ఈ వ్యవహారంలో ఎంతవరకు సంబంధం ఉంది, నకిలీ పత్రాలను ఇంటర్మీడియట్ బోర్డుకు ఎవరు సమర్పించారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు సమర్పించినట్లు గుర్తించిన ఈ ఎనిమిది కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని సంబంధిత అధికారులను హైడ్రా కోరినట్లు సమాచారం. hydra commissioner sign Forgery, Fak, Nocs, Lake, police, case
http://www.teluguone.com/news/content/hydra-commissioner-sign-forgery-36-228068.html





