కేసీఆర్, హరీష్ లకు హైకోర్టులో భారీ ఊరట
Publish Date:Apr 22, 2026
Advertisement
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి. హరీశ్ రావుతో పాటు మరో ఇద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణ కమిషన్ చట్టం కింద నిర్దేశించిన సరైన ప్రక్రియను ఘోష్ కమిషన్ పాటించలేదని ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీశ్ రావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ సీఎస్ ఎస్.కె. జోషి, ప్రస్తుత ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ వేర్వేరుగా రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం.. ఆ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై చర్యలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు స్వాగతించారు. కమిషన్ నిబంధనలు పాటించలేదని హైకోర్టు గుర్తించిందని, కోర్టు తీర్పు తమకు లభించిన పెద్ద ఊరటగా భావిస్తున్నామనీ ఆయన పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నిలబడుతుందని కోర్టు తీర్పు ద్వారా మరోసారి నిరూపితమైందని పేర్కొన్న హరీష్ రావు.. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టిందన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని కోర్టు స్పష్టంగా పేర్కొందన్నారు.
http://www.teluguone.com/news/content/huge-relief-for-kcr-and-harish-in-high-court-36-217930.html





