ముహుర్తాలే ముహుర్తాలు.. సీజన్ షురూ.. ఇప్పుడైనా పెళ్లి చేసుకోండి ప్రసాదులు!
Publish Date:Apr 14, 2022
Advertisement
కరోనా కారణంగా రెండేళ్లుగా పెద్దగా పెళ్లిళ్లు జరగలేదు. అప్పటికే ఫిక్స్ అయిన మ్యారేజ్‌లు మినహా.. ఆంక్షల వల్ల కొత్త పెళ్లిళ్ల హడావుడి అంతగా కనిపించలేదు. కొన్ని వివాహాలు జరిగినా.. ఏదో సింపుల్‌గా చేసుకున్నామా అంటే చేసుకున్నాం అన్నట్టు కానిచ్చేశారు. గ్రాండ్ వెడ్డింగ్స్ జరిగినవి కొన్నే. ఇప్పుడిక కరోనా ఖతం కావడంతో.. ప్రభుత్వం ఆంక్షలు తొలగించడంతో.. ఈసారి ఆడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకునే వారి సంఖ్య పెరిగింది. అందుకు అదనంగా.. ఈ సీజన్‌లో ముహుర్తాలు సైతం చాలానే ఉండటం చెప్పుకోదగిన విషయం. ఈ సారి ఏప్రిల్ 13 నుంచి జూన్ 23 వరకు పెళ్లిళ్లకు శుభ ముహూర్తాలు ఉన్నాయంటున్నారు పంతుళ్లు. ఏప్రిల్‌లో.. 13, 14, 15, 16, 17, 21, 22, 24.. మే నెలలో.. 3, 4, 13, 14, 15, 18, 20, 21, 22, 25.. ఇక జూన్ నెలలో.. 1, 3, 5, 8, 9, 10, 15, 17, 18, 19, 22, 23 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, ఈ మూడు నెలల్లో పెళ్లిళ్లు చేయాలనుకునే, చేసుకోవాలనుకునే వారు.. వెంటనే జాగ్రత్త పడితే మంచింది. ఎందుకంటే.. ఏ మాత్రం ఆలస్యం చేసినా.. ఫంక్షన్ హాల్స్ దొరక్కపోవచ్చు. పంతుళ్లకూ ఫుల్ డిమాండ్ ఉండటంతో వారూ బిజీగా ఉండొచ్చు. ఇక, క్యాటరింగ్, ఫోటో గ్రాఫర్స్, డెకరేషన్.. తదితరాలు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే, ముందుగా పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొని.. వెంటనే కల్యాణ మండపాలకు ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటే బెటర్. లేదంటే, ఆతర్వాత ఇబ్బంది పడాల్సి రావొచ్చు. ఇక, చీరలు, బంగారం కొనుగోళ్లతో షాపులు రద్దీగా ఉండటం ఖాయం. మరోవైపు, ఇదే అదనుగా అంతా రేట్లు పెంచేస్తున్నారు. పంతుళ్లు 10 వేలు ఇస్తామంటే చీప్‌గా చూస్తున్నారు. లక్ష పెట్టందే ఓ మోస్తారు ఫంక్షన్ హాల్ దొరకట్లే. కట్నాలేమో కానీ.. పెళ్లి ఖర్చులు తడిసి మోపెడు అవడం ఖాయం. ఈ సీజన్ మూడు నెలలు కాసుల గలగలలే. పెళ్లిళ్ల సందడే. ఒకే రోజు రెండు మూడు పెళ్లిళ్లకు వెళ్లాల్సి రావొచ్చు. తృప్తిగా పసందైన పెళ్లి భోజనం తిని ఎన్నాళ్లైందో అనుకునే వారు ఇక ఓ పట్టు పట్టేయొచ్చు. గెట్ రెడీ....
http://www.teluguone.com/news/content/huge-marriage-dates-in-next-three-months-39-134394.html





