బిగ్ బాస్ రియాల్టీ షో పై ఏపీ హైకోర్టు సీరియస్.. సమాజాన్ని పెడతోవ పట్టిస్తోందని కామెంట్
Publish Date:Apr 30, 2022
Advertisement
బుల్లి తెరపై విపరీతమైన ఫాలోయర్స్ ఉన్న రియాల్టీ షో బిగ్ బాస్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఆ షో వల్ల యువత చెడు మార్గంలో వెళుతున్నారని వ్యాఖ్యానించింది. బిగ్ బాస్ షోలో అసభ్యత, అశ్లీలం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రేక్షకాదరణ ఉన్నప్పటికీ అదే స్థాయిలో బిగ్ బాస్ రియాల్టీ షోపై విమర్శలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. సీపీఐ నారాయణ అయితే ఒక అడుగు ముందుకు వెళ్లి బిగ్ బాస్ హౌస్ బ్రోతల్ హౌస్ అంటూ ఘాటుగా విమర్శించారు. అసలు ఈ షోను నిలిపివేయాలని కోరుతూ 2019లోనే హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ పిల్ పై తాజాగా హైకోర్టు స్పందించింది. దీనిపై సోమవారం నుంచి విచారణ చేపడతామని పేర్కొంది. ఆ సందర్భంగానే షోపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. అంతటితో ఊరుకోకుండా పిల్ వేసిన వారిని అభినందించింది. బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయ్యిందో...అంతే వివాదాస్పదంగా కూడా మారిన సంగతి తెలిసిందే. వినోదం పేరుతో ప్రదర్శితమౌతున్న ఈ షోలో వినోదం పేరిట అసభ్యత, అశ్లీలతకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే షో నిర్వాహకులు ఈ విమర్శలను కొట్టి పారేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు బిగ్ బాస్ షోపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇక పిల్ విషయానికి వస్తే జగదీశ్వర రెడ్డి అనే వ్యక్తి బిగ్ బాస్ షో వల్ల యువత పెడమార్గం పడుతోందని పేర్కొంటూ పిల్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైనే తాజాగా హైకోర్టు బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలు సమాజాన్ని పెడతోవ పట్టిస్తున్నాయని వ్యాఖ్యానించింది. సోమవారం నుంచి విచారణ చేపడతామని జస్టిస్ అసమద్దీన్ అమానుల్లా, జస్టిస్ రాజశేఖరరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
http://www.teluguone.com/news/content/high-court-serious-in-big-boss-reality-show-25-135258.html





