మోహిత్ రెడ్డిని అలా ఎలా వదిలేశారు?
Publish Date:Jul 30, 2024
Advertisement
హత్యాయత్నం కేసులో అరెస్టు చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చి వదిలేయడంపై హైకోర్టు విస్తుపోయింది. పోలీసులను తప్పుపట్టింది. అయితే పోలీసులకు మద్దతుగా ప్రభుత్వ లాయర్ వాదించారు. అసలు రాష్ట్రంలో అధకారంలో ఉన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా పోలీసుల తీరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవహారం ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ అరాచపాలనను భరించలేక జనం ఆయన ప్రభుత్వానికి చరమగీతం పాడుతూ అఖండ మెజారిటీ ఇచ్చి మరీ తెలుగుదేశం కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి కూడా రెండు నెలలు కావస్తున్నది. అయినా ఇంకా క్షేత్ర స్థాయిలో మరీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో జగన్ పార్టీ నేతల మాటే చెల్లుబాటు అవుతోందా అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. అందుకు చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడి అరెస్టు విడుదల ఉదంతమే తాజా ఉదాహరణ. పులివర్తి నానిపై హత్య యత్నం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనపై లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే దుబాయ్ చెక్కేయడానికి రెడీగా ఉన్న మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే జైలుకు మాత్రం తరలించలేదు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకుంటున్న సమయంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా పక్కనే ఉన్నారు. అందుకే ఏం మతలబు చేశారో తెలియదు కానీ పోలీసులు మాత్రం మోహిత్ రెడ్డికి 41ఏ కింద నోటీసులు ఇచ్చి విడిచిపెట్టేశారు. మోహిత్ రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించడం జరగాల్సి ఉండగా పోలీసులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. దీంతో పోలీసులను కోర్టు నిలదీసింది. హత్యయత్నం కేసులో నిందితుడికి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేసిన సంఘటన గతంలో ఎన్నడైనా ఉందా అని ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నించిన సంగతిని పక్కన పెడితే మోహిత్ రెడ్డి పట్ల పోలీసులు చూపిన ఔదార్యం తెలుగుదేశం శ్రేణులలో తీవ్ర ఆగ్రహానికి కారణమౌతోంది. ఇటువంటి తీరు తెలుగుదేశం కూటమి శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు. జగన్ హయాంలో 41ఏ నోటీసులు ఇవ్వాల్సిన కేసుల్లో కూడా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా తెలుగుదేశం నేతలు, శ్రేణులను అరెస్టులు చేశారు. అదే తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో కూడా అరెస్టు చేసి జైలుకు తరలించాల్సిన కేసుల్లో కూడా వైసీపీ నేతలకు 41ఏ నోటీసులు ఇచ్చి విడిచిపెట్టేస్తున్నారు. సోషల్ మీడియా కేసుల్లోనే తలుపులు బద్దలుకొట్టి మరీ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసిన ఉదంతాలను గుర్తు చేస్తూ ఇప్పుడు పోలీసులు మోహిత్ రెడ్డిపై అంతులేని ఔదార్యాన్ని ప్రదర్శించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
http://www.teluguone.com/news/content/high-court-question-police-issue-41a-to-mohitreddt-39-181801.html





