వినూత్న పంధాలో ఉద్యమం నడిపిస్తున్న హార్దిక్ పటేల్
Publish Date:Sep 10, 2015
Advertisement
గుజరాత్ రాష్ట్రంలో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కోరుతూ ఉద్యమిస్తున్న హార్దిక్ పటేల్ తన ఉద్యమాన్ని వినాశకర మార్గంలో ముందుకు నడిపిస్తున్నట్లు కనబడుతోంది. ఆయన ఉద్యమం మొదలుపెట్టిన మూడవరోజే గుజరాత్ రాష్ట్రంలో విద్వంసకర రూపం దాల్చడంతో దానికి తొమ్మిది మంది బలయ్యారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అతను మరొక విద్వంసక ప్రయత్నం చేస్తున్నాడు. పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారందరూ బ్యాంకుల్లో దాచుకొన్న తమ డబ్బుని వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి ఆర్ధిక సహాయ నిరాకరణ చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా మోడీ ప్రభుత్వం తప్పకుండా దిగి వస్తుందని చెపుతున్నారు. ఒక విధంగా అతని ఆలోచన అద్భుతంగానే ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ దాని వలన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై పెనుప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రంలో వ్యాపార మరియు ఇతర రంగాలలో పటేల్ సామాజిక వర్గమే ఆధిపత్యం కలిగి ఉంది. ఒక అంచనా ప్రకారం గుజరాత్ లో వివిధ బ్యాంకులలో పటేల్ సామాజిక వర్గానికి సుమారు 70లక్షల ఖాతాలున్నాయి. వాటిలో కనీసం రూ.350 కోట్లు ఉంటాయని అంచనా. కానీ పటేల్ సామాజిక వర్గం ఆర్ధికంగా చాలా బలంగా ఉన్నందున ఆ అంచనాలకు మించి డబ్బు నిల్వలు ఉండి ఉండవచ్చును. దానిని వారు వెనక్కి తీసుకోవడం మొదలుపెడితే బ్యాంకులు కుప్ప కూలే ప్రమాదం ఉంది. ఇటువంటి వినాశకర ఆలోచనలకు తాము మద్దతు ఈయలేమని గుజరాత్ వాణిజ్య మండలి తేల్చి చెప్పింది. కానీ హార్దిక్ పటేల్ తన సామాజిక వర్గానికి ఇచ్చిన ఈ పిలుపు ద్వారా వారే సమాజాన్ని శాసించే స్థితిలో ఉన్నారని దృవీకరించినట్లయింది. అటువంటప్పుడు వారికి కూడా రిజర్వేషన్లు కావాలని హార్దిక్ పటేల్ ఎందుకు పోరాటం చేస్తున్నాడు? అతని పోరాటం వెనుక ఎవరున్నారు? వారి ఉద్దేశ్యాలేమిటి? అనే ప్రశ్నలు అతని పోరాటంలో చిత్తశుద్ధిని శంఖించేలా చేస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/hardik-patel-45-49917.html





