ఇక బీజేపీకి దబిడి దిబిడే!
Publish Date:Aug 12, 2022
Advertisement
బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం కుప్ప కూలి మహాఘట్ బంధన్ సర్కార్ కొలువు తీరిన అనంతరం జాతీయ స్థాయిలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. బీహార్ లో బీజేపీయేతర శక్తులన్నీ ఏకమైన విధంగానే జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు మార్గం సుగమమైందని పరిశీలకులు అంటున్నారు. గతంలోలా కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న పోటీ తీవ్రత గణనీయంగా తగ్గిందంటున్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఆర్జేడీ నాయకులు తేజస్వి యాదవ్ లు చొరవ తీసుకుంటారని చెబుతున్నారు. వారి వెనుక ర్యాలీ కావడానికి జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలకు ఎటువంటి అభ్యంతరం ఉండక పోవచ్చునని అంచనా వేస్తున్నారు. బీజేపీ కూటమి ఏర్పాటు సన్నాహాలలో భాగంగానే తేజస్వి యాదవ్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అదినేత్రితో బేటీ అయ్యారని అంటున్నారు. సోనియాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయాలను ప్రస్తావిస్తూ ఇప్పుడు ఇక దేశ వ్యాప్తంగా బీహార్ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. బిహార్‌లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైన విధంగానే, దేశ వ్యాప్తంగా కూడా రాజకీయ బీజేపీయేతర రాజకీయ పార్టీలు విభేదాలు విస్మరించి ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తేజస్వి యాదవ్ చెప్పారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మతపర ఘర్షణలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దీంతో ప్రజాభీష్టం మేరకు 2024 ఎన్నికలలో బీజేపీని ఓడించడమే ఇప్పుడు దేశంలోని అన్ని బీజేపీయేతర పార్టీల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఆ బాధ్యతతోనే పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడానికి సుముఖంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్ లో అదే జరిగిందనీ, దేశ వ్యాప్తంగా ఇదే రిపీట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీహార్ పరిణామాలు బీజేపీకి చెంపపెట్టు వంటివని అన్నారు. ప్రాంతీయ పార్టీలను నాశనం చేయాలని బీజేపీ భావిస్తోందని అన్నారు. అయితే దేశంలో ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడం అసాధ్యమన్న తేజస్వి యాదవ్..బీజేపీకి ముందున్నది గడ్డుకాలమేనని పేర్కొన్నారు. కాగా తన హస్తిన పర్యటనలో సోనియాగాంధీతో పాటు పలువురు విపక్ష నేతలతోనూ తేజస్వి ప్రసాద్ భేటీ అయ్యారు.
http://www.teluguone.com/news/content/haed-time-to-bjp-in-future-says-tejaswi-25-141839.html





